కార్వేటినగరం: ‘పెట్టరా అమరావతి... పిలవరా కమ్మరావతి’ అంటూ అమరావతి కాదు.. కమ్మరావతి అని పిలవాలని సాక్షాత్తు రాజ్యసభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అనడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం పుత్తూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు తన సామాజికవర్గ అభివృద్ధి కోసం సొంత నిర్ణయాలతో కట్టు కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. కనీసం 10 వేల మంది జనాభా లేని ప్రాంతంలో అమరావతి పేరుతో రాజధాని చేయడంపై ప్రజలు విమర్శిస్తున్న తెలిపారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు చేస్తున్న అవీనితిపై ప్రధాని మోదీ సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వేంకటేశ్వరస్వామి కూడా కమ్మ సామాజిక వర్గం అని సినీ నటుడు మురళీమోహన్ చెప్పడం హాస్యాస్పదమ న్నారు. వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మాణం చేస్తే వరదలు వచ్చినప్పుడు నీట మునుగుతుందని గుర్తించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతంలో రాజధాని చేస్తే పరిశ్రమలు వచ్చి పెద్ద నగరంగా అభివృద్ధి చెందే అవకావముందన్నారు. దానికోసమే మాజీ సీఎం వైఎస్ జగన్ మావిగన్ తీసుకొచ్చారని చెప్పారు.
మూడు నగరాలను కలిపితే..!
నగరాలను కలుపుకుని కారిడార్ కింద అభివృద్ధి చేస్తే ప్రపంచంలోనే అతి పెద్ద రాజధానిగా విలసిల్లుతుందని నారాయణ స్వామి చెప్పారు. రాజాధాని ముసుగులో జరుగుతున్న అతి పెద్ద కుంభకోణాన్ని కేంద్రం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎంపీలు మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు వివరించినా ప్రధాని మోదీ మౌనంగా ఉండడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. రాజధాని పేరుతో భూములు లాక్కున్న రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.


