నగరి–దిండివనంకు రూ.592.93 కోట్లు శరవేగంగా పనులు 20 ఏళ్ల కల సాకారం భూసేకరణ, ప్రాజెక్టు వ్యయం పెరగడంతో తీవ్ర ఆలస్యం మళ్లీ నిధులు మంజూరు
నగరి : ఎంతో ప్రతిష్టాత్మకంగా 2006లో రైల్వేశాఖ ప్రకటించిన దిండివనం –నగరి రైల్వేలైన్ ప్రాజెక్టు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించారు. టెండర్లు పూర్తవడంతో నగరి నుంచి రైల్వేలైన్ పనులు ప్రారంభమయ్యాయి. తమిళనాడు, విల్లుపురం, తిరువణ్ణామలై, వెల్లూరు నుంచి తిరువళ్లూరు జిల్లాకు రైలు మార్గాన్ని అనుసంధానం చేసేందుకు 2006లో రైల్వేశాఖ దిండివనం–నగరి రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందులో భాగంగా విల్లుపురం జిల్లాల్లోని దిండివనం నుంచి రేణిగుంట – అరక్కోణం సెక్షన్‌లోని నగరి వరకు 184.5 కి.మీ మేర కొత్త రైల్వేలైన్ నిర్మించేందుకు 2008లో రూ.582.83 కోట్ల వ్యయంగా నిర్ణయించారు. 2020లోపు పూర్తిచేసేందుకు రూ.20 కోట్ల నిధులు ఆ ఏడాదే విడుదల చేశారు. ఆ నిధులతో 6 కి.మీ మేర పనులు జరిగినా ఆపై భూసేకరణలో సమస్యలు ఎదురయ్యాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2020 నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టింది. వాలాజా రోడ్డు నుంచి రాణిపేట వరకు ఎలక్ట్రిఫికేషన్‌తో పాటు పట్టాల ఏర్పాటు పనులు వేగంగా జరిగాయి. ఆపై భూసేకరణతో పాటు నిధుల సమస్య వెంటాడి పనులు మందగించాయి. 2024 నాటికి ప్రాజక్టు వ్యయం రూ.3,361 కోట్లకు చేరగా మార్చి 31, 2027 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ నిర్ణయించారు. ఇప్పటి వరకు 81 శాతం భూసేకరణ పూర్తయింది. ప్రస్తుతం రూ.592.93 కోట్లు మంజూరు కావడంతో 2028కి పూర్తిచేసేలా టార్గెట్ విధించారు.
33 కి.మీ రైల్వేలైన్ నిర్మించేలా..
ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు సంబంధిత టెండర్లు పూర్తవడంతో 33 కి.మీ మేర రైల్వేలైన్ నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. నగరి నుంచి పొదటూరుపేట వరకు 13 కి.మీ, వాలాజా రోడ్డు నుంచి షోళింగర్ వరకు 20 కి.మీ మేర రైల్వేలైన్ నిర్మించనున్నారు. వీటికి సంబంధిత పనులు నగరిలో ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయితే
ఇది దక్షిణ రైల్వేలో మరో ముఖ్యమైన అనుసంధాన రైల్వే లైన్ అవుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు విల్లుపురం నుంచి అరక్కోణం లేదా చైన్నెకి రావలసిన అవసరం ఉండదు. వాలాజా రోడ్ నుంచి నగరి మీదుగా రేణిగుంట మార్గంలో వెళతాయి. ముంబై, ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. వాణిజ్య కార్యకలాపాలు కూడా వృద్ధి చెందుతాయి. దిండివనం, రాణిపేట, శోళింగర్ నుంచి నగరి వరకు ప్రయాణించే ప్రజలకు ప్రయాణం సులభతరమవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


