104 సంచార వైద్యానికి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

104 సంచార వైద్యానికి షాక్‌

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

● ఈహెచ్‌ఆర్‌ అమలుతో అందని వైద్యం ● ఓటీపీ లేకుంటే మందులూ లేవు ● వృద్ధుల పరిస్థితి దయనీయం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో 104 వాహనాలు 39 ఉన్నాయి. ఇవి జిల్లాలోని 614 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు నెలకు రెండుసార్లు చొప్పున వెళ్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వర కు ప్రజలకు వైద్య సేవలు అందిస్తాయి. 104 వైద్య శిబిరా లను సచివాలయం లేదా కమ్యూనిటీ హాళ్లలో నిర్వహిస్తారు. వైద్య సేవల్లో డ్రైవర్‌, డీఈవో, ఏఎన్‌ఎం, ఆశా, ఎంఎల్‌హెచ్‌పీలు, మెడికల్‌ ఆఫీసర్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొంటారు. రెండేళ్లుగా ఈ సేవలకు నిర్లక్ష్యపు జబ్బు చేసింది.

రెండేళ్లుగా క్షీణించిన సేవలు

రెండేళ్లలో 104 సేవలు గణనీయంగా తగ్గాయి. వైద్యులు సేవలకు డుమ్మా కొడుతున్నారు. అంతా సిబ్బంది మీదే నెట్టేస్తున్నారు. అంతా సిబ్బంది మీదే నెట్టేస్తున్నారు. దీంతో సిబ్బంది తూతూమంత్రంగా శిబిరాలు నిర్వహిస్తూ మాత్రలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తద్వారా 104 సంచార వైద్యం లక్ష్యం నీరుగారిపోతోంది.

పడిపోయిన ఓపీలు

డాక్టర్లు ప్రభుత్వ వైద్య సేవలపై చిన్న చూపు చూడడంతో 104లో ఓపీల సంఖ్య దారుణంగా పడిపోతోంది. వైద్యులు లేకుండా సిబ్బంది తూతూమంత్రం వైద్యం అందిస్తుండడంతో జబ్బులు నయం కావడం లేదు. దీనికితోడు 104లో మందుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఈ ప్రభావంతోనే ఓపీల సంఖ్య ఘణనీయంగా తగ్గుముఖం పడుతోంది. వృద్ధులు సైతం 104 సేవలకు ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా పేదలు అప్పులు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది.

వెలుగులోకి బోగస్‌ ఓపీల బాగోతం...

ఓపీ నమోదులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్యాలను చేరుకోవడానికి 104 వాహనాల సిబ్బంది తప్పుడు వివరాలతో ఓపీలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఈ సమస్యలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఆధార్‌ నంబర్‌తో వైద్య సేవలకు చెక్‌ పెడుతోంది. మొబైల్‌ ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేసింది. ప్రస్తుతానికి ఓటీపీ ఆధారంగానే 104 సేవలు పొందాలని సిబ్బంది పల్లె జనానికి వివరిస్తున్నారు. ఈ విధానం కొత్త సమస్యలకు దారి తీస్తోంది.

ఓటీపీ ఉండాల్సిందే..

ఓటీపీ లేకుండా మందులు కూడా ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు, మొబైల్‌ ఫోన్‌ లేకపోవడంతో అనేక మంది పేదలు వైద్య సేవలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఫోన్‌ లేకపోవడం, ఓటీపీ గురించి తెలియకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రజల ఒత్తిడి మధ్య 104 సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సేవలు అందించలేక తలలు పట్టుకుంటున్నారు.

104వాహనం

వైద్యసేవలు అందిస్తున్న దృశ్యం (ఫైల్‌)

పేదలు తాము సంపాదించిన అరకొర ఆదాయంలో ఎక్కువ భాగం విద్య, వైద్యానికే ఖర్చు చేస్తారు. దీనివల్ల వారి బతుకులు ఎదుగూబొదుగూ లేకుండా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. ఈ క్రమంలో వారికి ఆరోగ్యపరంగా ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ పేదల ఆరోగ్య భద్రత పథకం కింద 104 సంచార వైద్య సేవలను తీసుకువచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్ట్‌ (ఈహెచ్‌ఆర్‌) అమలు తర్వాత సేవలు దూరమయ్యాయి. ఓటీపీ విధానం తప్పనిసరి చేయడంతో వృద్ధులు వైద్య సేవలు పొందలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement