తిరుపతి సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు మండలం శెట్టిన్ తంగాల్ గ్రామం వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఆదివారం ఇసుక అక్రమ తవ్వకాలు వెలుగుచూశాయి. శెట్టిన్ తంగాల్‌కు చెందిన ఒక టీడీపీ నేత మరో ఐదుగురితో కలిసి శెట్టిన్ తంగాల్ రోడ్డు నుంచి రీచ్‌కు రోడ్డు వేశాడు. ఈ రోడ్డు ఏర్పాటు శనిశారం పూర్తి కావడంతో ఆదివారం ఇసుక తవ్వకాలు ప్రారంభించాడు. జేసీబీతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నాడు. దీన్ని గుర్తించిన గ్రామస్తులు, టీడీపీలోని ఒక వర్గం నేతలు అప్రమత్తమయ్యా రు. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వర్గం వారు ఇసుక తవ్వకాలు చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుసుకున్న అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అక్రమా ర్కులపై ఆరా తీసిన అధికారులు ఆ టీడీపీ నేతను పిలిచి మందలించినట్లు తెలిసింది. మరో సారి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
శెట్టిన్ తంగాల్‌ను పచ్చ తోడేళ్లు చెరబట్టాయి. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నాయి. జేసీబీలతో తవ్వి డంపు చేసి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఈ దందా ఊరంతా పాకి.. అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంతలోనే జేసీబీలు, ట్రాక్టర్లు రీచ్ నుంచి పరరాయ్యయి. అధికారులు అక్రమార్కులపై ఆరా తీసి హెచ్చరికలు జారీ చేశారు.


