రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా 96.26 శాతం పన్నుల వసూలు
●
గ్రామ పంచాయతీలకు ముఖ్యమైన ఆదాయ వనరు పన్నులు. వాటిని సకాలంలో వసూలు చేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయవచ్చు. అలాగే సిబ్బందికి జీతాలు చెల్లించవచ్చు. తద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీలోనూ మార్చి నెలాఖరులో వందశాతం పన్నులు వసూలు చేయాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తుంటారు. చిత్తూరు జిల్లా అధికారులు పన్నుల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో 96.26 శాతం వసూలు చేశారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు.
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో మొత్తం 621 పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలోని పన్నుల వసూలు లక్ష్యం రూ.24.36 కోట్లు, పాత బకాయిలు రూ.2.94 కోట్లు. మొత్తం రూ.27.29 కోట్లు. వాటిని వసూలు చేయడానికి పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. గడువు సమయంలో తొందర పడకుండా ముందస్తుగా దశలవారీగా సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో పాత బకాయిలు రూ.2.67 కోట్లు, పన్నుల వసూళ్లు రూ.23.60 కోట్లు కలిపి మొత్తం రూ.26.27 కోట్లు సాధించారు. రాష్ట్రంలో 96.26 శాతం పన్నుల వసూళ్లతో మొదటి స్థానాన్ని సాధించారు. ఇంకా పాత, కొత్త బకాయిలు కలిపి మొత్తం రూ.1.02 కోట్లు వసూలు కాలేదు. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో కలుపుకుని వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది సైతం పన్నుల వసూళ్లలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి
ప్రతి ఏటా పన్నులు వసూలు చేయాలని అధికారులు చెప్పడం.. క్షేత్రస్థాయి సిబ్బంది సరే అనడం.. తీరా మార్చి వచ్చాక ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ సారి అధికారులు సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తూనే వారితో ఎలా పనిచేయించుకోవాలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఐదు నెలల ముందునుంచే పన్నుల వసూలుపై సమావేశాలు, రోజు ఫోన్‌లో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఒకేసారి ఒత్తిడి తీసుకురాకుండా లక్ష్యం చేరుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ అంశాన్ని అధికారులు పదేపదే చెప్పడంతో పన్నులు వసూలు చేయనిదే వదిలేలా లేరని పంచాయతీ కార్యదర్శులు అభిప్రాయానికి వచ్చారు. ఇతర జిల్లాల్లో పన్నుల వసూళ్లకు సంబంధించి కార్యదర్శులకు షోకాజ్‌లు ఇవ్వగా, చిత్తూరు జిల్లాలో అలాంటిది లేకుండా జాగ్రత్త పడ్డారు. ఉద్యోగులను అవమానపరచడం సరికాదని భావించి మాటలతోనే ఒత్తిడి తెచ్చారు. వినకపోతే చర్యలు ఉంటాయని, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పడంతో వయస్సు మీరిన వారు, ఆరోగ్య సమస్యలున్న వారు సైతం కష్టపడి పనిచేశారు. దీనికి తోడు ఓటర్ల జాబితా పనులు, సర్వేలు ఉన్నా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పన్నులు చెల్లించాలని గ్రామస్తులకు చెబుతూ వసూళ్లు ప్రారంభించారు. జనవరి నుంచి వీటిని వేగం పెంచారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, మండల, డివిజనల్ అధికారులు ఐక్యమత్యంగా దృష్టి పెట్టారు. అంతేగాక ప్రతి గ్రామ పంచాయతీలోనూ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది అందరికీ పలు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోల ప్రత్యేక పర్యవేక్షణ చేయడంతో పన్నుల వసూలు లక్ష్యానికి చేరుకున్నారు.
టీంవర్క్‌తోనే సాధ్యం
అందరి సహకారంతోనే పన్నుల వసూళ్లు 96.26 శాతం సాధ్యమైంది. గత సంవత్సరం రాష్ట్రంలో రెండో స్థానం రాగా, ప్రస్తుతం మొదటి స్థానం వచ్చింది. దీంతో పాటు పలు అంశాలపై కుప్పం బ్లాక్‌కు జాతీయ అవార్డు వచ్చింది. పని విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి పెట్టినా.. అందుకు తగిన ఫలితం దక్కింది. టీంవర్క్‌తోనే ఇది సాధ్యపడింది. – సుధాకర్‌రావు, డీపీవో


