కుప్పం రూరల్ : కుప్పంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులను కట్టడి చేయడానికే పోలీసులు 30 యాక్టు అమలుచేస్తున్నారని ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కర్త, ఎమ్మెల్సీ భరత్ ఆరోపించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కుప్పంలో ప్రతినెలా పోలీసు 30 యాక్టును అమలు చేస్తున్నారని తెలిపారు. తాము పార్టీ ఆవిర్భావం, పార్టీకి సంబంధించిన సమావేశాలు, మృతిచెందిన మా నేతలకు నివాళి తదితర కార్యక్రమాల నిర్వహణకు అనుమతి కోరితే తిరస్కరిస్తున్నారని, కూటమి నేతలు గంటల తరబడి రోడ్ల ను బ్లాక్ చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్ద స్పీకర్లు పెట్టు కుని చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేసినా, వందల సంఖ్యలో గుమికూడి అలజడి సృష్టించినా చూసీచూడనట్టు ఉంటున్నారని దుయ్యబట్టారు. తమ నాయకులపై దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికై నా కుప్పం పోలీసులు సమన్యాయంతో వ్యవహరించాలని, లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


