తిరుపతి సిటీ: మదనపల్లి–పీలేరు సెక్షన్ ఎన్‌హెచ్–71పై ఇటీవల 40 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఫ్లైఓవర్‌పై సరైన ప్రవేశ, నిష్క్రమణ మార్గా లు లేకపోవడంతో కలికిరి ప్రాంతానికి చెందిన 60 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉన్నాయని, అయినప్పటికీ కలికిరి పట్టణ సమీపంలో ప్రధాన రహదారిని చేరుకోవడానికి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయలేదన్నారు. సమీప ప్రవేశ మార్గం 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో స్థానికులతో పాటు బస్సులు, ప్రజారవాణా వాహనాలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కలికిరికి అనుసంధానం తగ్గిందన్నా రు. ఐఆర్‌సీ ఎస్పీ 84:2014 ప్రకారం పట్టణ ప్రాంతాలు, ప్రధాన పట్టణాల్లో సర్వీస్ రోడ్లకు ఒకటి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ప్రవేశ మార్గాలు కల్పించాలని సిఫార్సు చేశారని, ఐఆర్‌సీ ఎస్పీ 99: 2013, ఎంఓఆర్‌టీహెచ్ సర్క్యులర్ల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఈ దూరం 2 నుంచి 5 కిలోమీటర్లు ఉండవచ్చన్నారు. 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో స్థానిక అనుసంధానాన్ని నిర్ధారించడానికి సుమారు కిలోమీటరు దగ్గరి దూరం అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద పట్టణానికి 6 కిలోమీటర్ల పరిధిలో ప్రవేశ లేదా నిష్క్రమణ మార్గం లేకపోవడం ఐఆర్‌సీ నిబంధనలకు విరుద్ధమని, ప్రజల సౌకర్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. దీనిపై దృష్టి సారించి కలికిరి ఫ్లై ఓవర్ సమీపంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను (స్లిప్ రోడ్లను) ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. డీపీఆర్‌ను సమీక్షించి కలికిరి ప్రధాన పట్టణంగా ఉన్నా తగినంత ప్రవేశ సౌకర్యం ఎందుకు కల్పించలేదో స్పష్టం చేయాలని కోరారు.


