చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన అనంతపురం జిల్లా డీఐఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సుధారాణి రాష్ట్ర శాఖకు బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ సంక్రమణ, అసంక్రమణ వ్యాధులపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. మాతా–శిశు మరణాలను తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బ, వడగాడ్పులతో వచ్చే వ్యాధులపై ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎక్కడైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్ నిర్వహించిన హీట్ స్ట్రోక్, హీట్ వేవ్స్‌పై జూమ్ సమావేశంలో పాల్గొని వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.
ఎస్‌ఈగా అమర్‌బాబు
బాధ్యతల స్వీకరణ
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌కో ఎస్‌ఈగా అమర్‌బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్‌ఎం విభాగం ఈఈగా పనిచేస్తూ పదోన్నతిపై ఎస్‌ఈగా జిల్లాకు వచ్చారు. ఆయనకు ఈఈలు మునిచంద్ర, సురేష్, పీవో రెడ్డెప్ప, అధికారులు, ఉద్యోగులు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ అందరినీ కలుపుకుని వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
4న జెడ్పీ సర్వసభ్య సమావేశం
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్‌నాయుడు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. జిల్లా అధికారులు తగిన సమాచారంతో రావాలని సూచించారు.
60 డివిజన్లతో
చిత్తూరు కార్పొరేషన్
చిత్తూరు అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపల్ కార్పొరేషన్లలోని డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా 50 డివిజన్ల పరిధిలో ఉన్న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను 60కి పెంచింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతున్న క్రమంలో డివిజన్ల పెంపు అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం 10 డివిజన్లను అదనంగా పెంచడంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 60 డివిజన్లకు పెరగనుంది. అలాగే తిరుపతి నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా అదనంగా మరో 16 డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి నగరం మొత్తం 66 డివిజన్లకు చేరింది.


