మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ధర్నా
జాతీయ రహదారిలో స్తంభించిన ట్రాఫిక్
పలమనేరు: సంచలనం సృష్టించిన టైలర్ చంద్రమ్మ హత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దపంజాణి మండలం పెద్ద ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ(35) అదృశ్యమై.. ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమెను బైక్‌పై తీసుకెళ్లిన సుబ్రమణ్యం అనే యువకుడు లింగాపురం ప్రాంతంలోని ఓ మామిడి తోపులో తన స్నేహితులతో కలిసి హత్య చేసి శవాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అడవిలో వేసినట్టు తెలుస్తోంది. పోలీసులు, క్లూస్ టీం అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రధాన నిందితుడైన సుబ్రమణ్యం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. అతని ద్వారా ఈ ఘటనలో పాల్గొన్న మిగిలిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
హైవేలో ఆందోళనకు దిగినమృతురాలి బంధువులు
అడవిలో ఉన్న తమ బిడ్డ మృతదేహాన్ని కూడా చూడనివ్వడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చైన్నె– బెంగళూరు హైవే నుంచి జగమర్ల అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయం తెలుసుకున్న పలమనేరు, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి ఎస్‌ఐలు స్వర్ణతేజ, మారెప్ప, చందనప్రియ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళన కారులతో చర్చించారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు పోలీసుల కాళ్లావేళ్లా పడడం, బతిమలాడడం అందరినీ కలచివేసింది.


