చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కోటిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు విక్రయించాలని ఆదేశించారు. మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలన్నారు. జిల్లాలో అక్రమంగా చేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలు లింగ నిష్పత్తిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లల భ్రూణ హత్యలకు సహకరించే ఏ వ్యవస్థనైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మెడికల్ అసోసియేషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మత్తు పౌడర్లు, నార్కోటిక్ మందుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. అక్రమ విక్రయాలపై సమాచారాన్ని ఈగల్ టోల్–ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కీర్తన, మెడికల్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
వార్డెన్లు తీరు మార్చుకోవాలి
జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న వార్డెన్లు తీరు మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువు, ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలన్నారు. బాలికల వసతి గృహాలను ఏఎన్‌ఎంలు, మెడికల్ ఆఫీసర్లు తరచూ సందర్శించి వైద్యసేవలు అందించాలన్నారు. అసిస్టెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు విధిగా వారానికి కనీసం నాలుగు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. కుప్పంలోని బాలుర వసతి గృహంలో సౌకర్యాల కొరత దృష్ట్యా, వెంటనే అనుకూలమైన అద్దె భవనాన్ని గుర్తించాలని ఆదేశించారు. హాస్టళ్లలో గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐసీడీఎస్ పీడీకి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వార్డెన్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ డీడీ రబ్బాని బాషా పాల్గొన్నారు.


