ఐరాల: మండలంలో ఏనుగుల గుంపు మళ్లీ దాడులు చేశాయి. మంగళవారం అర్థరాత్రి చుక్కావారిపల్లె గ్రామానికి చెందిన రైతులు రఘునాథ్‌రెడ్డి, టీ.సంపూర్ణమ్మ, తిరుమలరెడ్డి ప్రకాష్, తిరుమల వాసుకు చెందిన మామిడి తోటలకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. మామిడి కొమ్మలను విరిచేసి, కాయలను తిని నాశనం చేశాయి. పది ఎకరాలకు పైగా మామిడి తోటల్లో మామిడి చెట్లను కూలదోశాయి. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. ఫోన్ ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ఏనుగుల గుంపు దాడి చేయడం పరిపాటిగా మారిందని, వాటిని కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకుని పంటలను కాపాడాలని కోరారు.
ఉన్నత స్థాయికి ఎదగాలి
యాదమరి: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం జిల్లా సైన్స్ అధికారి మోహన్ సింగ్‌తో కలిసి యాదమరి మండలంలోని పచ్చాపూరు ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేశారు. జీఎఫ్‌ఎల్‌ఎన్ ఎండ్‌లైన్ పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యంపై సంతప్తి వ్యక్తం చేశారు. ఎంఈవో మహబూబ్ బాషా, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
9 మందిపై కేసు నమోదు
గంగాధర నెల్లూరు: మండలంలోని పాత వెంకటాపురంలో సత్యమ్మ గుడి నిర్మాణం వివాదంలో 9 మందిపై కేసు నమోదు చేశారు. జీడీ నెల్లూరు మండలంలోని పాత వెంకటాపురం పంచాయతీ గుండ్ల వెంకటాపురం గ్రామంలో సత్యమ్మ ఆలయ నిర్మాణంపై 50 కుటుంబాలు ఉన్న వడ్డెర కులస్తులకు, అదే గ్రామానికి చెందిన అశోక్ నాయుడుకు వివాదం నెలకొంది. ఈ గొడవలో 9 మంది వడ్డెర కులస్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిలో జానకిరామ్, నటరాజ్, యోగానందం, రాజవేలు, ఉమాపతి, అర్జున్, కన్నయ్య, జయశంకర్, సుబ్రహ్మణ్యం ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం ఇరువర్గాల వారిని జీడీ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇరువర్గాల గొడవలో అగ్రవర్ణాలకు చెందిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


