కుప్పం రూరల్: వైఎస్సార్ సీపీ మద్దతుదారులుగా ఉన్న సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోందని చిత్తూరు ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కర్త భరత్ ఆరోపించారు. ఆయన బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 91 పంచాయతీలకు గాను 77 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారని చెప్పారు. గెలిచిన సర్పంచులు ఎలాంటి పక్షపాతం లేకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. భారీ గెలుపును తట్టుకోలేని టీడీపీ నాయకులు అప్పట్లో తీవ్రంగా నిరాశకు గురయ్యారని తెలిపారు. 2024లో టీడీపీ ప్రభుత్వం రావడంతో వైఎస్సార్ సీపీ సర్పంచులపై అక్కసు వెళ్లగక్కుతున్నట్టు విమర్శించారు. తాగునీరు, పారిశుధ్యం, పైపులైన్ల ఏర్పాటు, బోర్ వెల్ రిపేర్లు వంటి మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇవ్వకుండా వేధిస్తోందని దుయ్య బట్టారు. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకూ బిల్లులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సజావుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా కలెక్టర్ కూడా టీడీపీ నియామక పదవిలో ఉన్న కడా ప్రాజెక్టు డైరెక్టర్‌ను అడగాలని తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కడా డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, ఎంపీడీవోల వద్దకు వెళ్లమంటున్నారని, అక్కడికి వెళితే టీడీపీ నాయకులను కలవాలంటూ బదులిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని విమర్శించారు. బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు.


