అర్ధగిరి హుండీ ఆదాయం రూ.11.19 లక్షలు | - | Sakshi
Sakshi News home page

అర్ధగిరి హుండీ ఆదాయం రూ.11.19 లక్షలు

Mar 26 2026 7:46 AM | Updated on Mar 26 2026 7:46 AM

● రెండు ప్రాజెక్ట్‌ల ఇంటర్వ్యూలు వాయిదా

తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలోని హుండీల ద్వారా రూ.11.19 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ రఘుపతి, ఈవో మునిశేఖర్‌ తెలిపారు. అర్ధగిరి క్షేత్రంలోని మండపంలో బుధవారం ఎండోమెంట్‌ అధికారి రాధిక పర్యవేక్షణలో హుండీల్లోని కానుకలను లెక్కించారు. గత సంవత్సరం డిసెంబర్‌ 18వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.11,19,899లు వచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో అరగొండ గ్రామీణ బ్యాంకు అధికారి పి.ఎం.ఉమామహేష్‌, ట్రస్టుబోర్డు సభ్యులు సుబ్రమణ్యం, శ్రీధర్‌నాయుడు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

నేడు పాఠశాలలకు పని దినం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు గురువారం పనిచేస్తాయని డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన పాఠశాలలకు సెలవు ఉంటుందని డీఈవో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.

అంగన్‌వాడీ హెల్పర్‌పోస్టులకు ఇంటర్వ్యూలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చిత్తూరు, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు, ఐరాల, బంగారుపాళ్యం, పులిచెర్ల ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 187 హెల్పర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి 261 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు వచ్చిన మహిళా అభ్యర్థులతో ఆర్డీవో కార్యాలయం కిక్కిరిసింది. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తాయని ఒకే రోజు ఆరు ప్రాజెక్టుల పరిధిలో పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు సమాచారం. బాగా ఆలస్యం అవుతుండడంతో రెండు ప్రాజెక్టులకు ఇంటర్వ్యూ లు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. దీంతో ఐరాల, జీడీ నెల్లూరు సీడీపీవో ప్రాజెక్ట్‌ పరిధిలోని పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరి, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓపై చర్యలు!

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆమెను రాష్ట్ర శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎక్కడా పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో చిత్తూరు డీఎంహెచ్‌ఓగా అనంతపురం జిల్లా డీఐఓగా పనిచేస్తున్న నాగశశిభూషణ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆయన ఏప్రిల్‌ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement