చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిభ చూపారు. వారిని బుధవారం డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించారు. డీఈవో మాట్లాడుతూ మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల్లో టీచర్లు ఏపీ జట్టు తరపున పాల్గొని కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు. విద్యాబోధనలోనే కాకుండా క్రీడా రంగంలోనూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. అనంతరం ప్రతిభ చాటిన సురేష్ (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీ, మంగళపల్లి), ముత్తు (పీఈటీ, జెడ్పీ ఎండీ, మంగళం), దేవేంద్ర (పీఈటీ, జెడ్పీ కీరమంద)ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీలు సిరాజ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు అభినందన
కార్వేటినగరం: జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఉద్యోగి మనోజ్‌కుమార్(ఇంజినీరింగ్ అసిస్టెంట్ కార్వేటినగరం) ప్రతిభ చూపాడు. ఆయనను బుధవారం ఎంపీడీవో మధుసూదన్ అభినందించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు పూణేలో జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖో–ఖో పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. అందులో ఏపీ జట్టు ప్రతిభ కనబరిచిందన్నారు. ఆ జట్టులో కార్వేటినగరం ఇంజినీరింగ్ అసిస్టెంట్ మనోజ్‌కుమార్ పాల్గొని కాంస్య పతకం సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏవో విద్యావతి, పీఆర్ ఏఈ దినేష్, చెంగల్‌రాయులు యాదవ్ పాల్గొన్నారు.


