గ్రీన్‌ రేటింగ్‌పై అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ రేటింగ్‌పై అవగాహన సదస్సు

Mar 26 2026 7:46 AM | Updated on Mar 26 2026 7:46 AM

శ్రీసిటీ (వరదయ్యపాళెం) : రాష్ట్రంలోని పరిశ్రమలలో సుస్థిర విధానాలు, గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా బుధవారం ‘గ్రీన్‌ రేటింగ్‌’పై శ్రీసిటీలో అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీపీసీబీ చైర్మన్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం ‘గ్రీన్‌ రేటింగ్‌’ విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా భాగం కావాలన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచాలనే లక్ష్యాన్ని, తీర ప్రాంతంలో ప్రతిపాదించిన ‘గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌’ ప్రణాళికను ప్రస్తావించారు.

సుస్థిరత శ్రీసిటీలో భాగం

శ్రీసిటీలో గ్రీన్‌ రేటింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు డాక్టర్‌ కృష్ణయ్యకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్రసన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుస్థిరత అనేది శ్రీసిటీలో అంతర్భాగమని పేర్కొ న్నారు. హరిత భవనాలు, పునరుత్పాదక శక్తి వినియోగం, సమర్థవంతమైన నీటి, వ్యర్థాల నిర్వహణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఏపీపీసీబీ రూపొందించిన ప్రోత్సాహక వ్యవస్థతో తమ పరిశ్రమలు క్రమంగా ప్రపంచ స్థాయి హరిత ప్రమాణాలను పాటిస్తున్నాయని చెప్పారు. అనంతరం సీఐఐ గ్రీన్‌కో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ క్లస్టర్‌ చైర్మన్‌ నిహాల్‌ కౌల్‌ మాట్లాడారు. ఇంధన శక్తి, నీరు, వ్యర్థాల వినియోగాన్ని క్రమబద్ధం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కంపెనీకి లాభాలు కూడా సాధ్యమవుతాయని చెప్పారు. సీఐఐ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ముత్తుసెళియన్‌ స్వాగత ఉపన్యాసం చేశారు. శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో సమగ్ర వ్యర్థాల నిర్వహణ, ఈ–వ్యర్థాల రీసైక్లింగ్‌ సదుపాయాలు త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని డాక్టర్‌ కృష్ణయ్య హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement