మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
గంగవరం: మండలంలోని మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరు గడ్డూరు కాలనీకి చెందిన జుబేర్(20), రామసముద్రానికి చెందిన శ్రీధర్(20) మదర్ థెరిసా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు ద్విచక్ర వాహనంలో పలమనేరు వెళ్తున్నారు. అదే మార్గంలో మేలుమాయి గ్రామానికి చెందిన మేసీ్త్ర దొరస్వామి(55) మేసీ్త్ర పని ముగించుకుని పలమనేరు నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలోని మేలుమాయి క్రాస్ వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని వారిని 108 అంబులెన్స్‌లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. సీఎంసీకి వెళుతుండగా మార్గమధ్యంలో దొరస్వామి మృతిచెందారు. ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


