వార్డుల పునర్విభజన షురూ..! | - | Sakshi
Sakshi News home page

వార్డుల పునర్విభజన షురూ..!

Mar 26 2026 7:46 AM | Updated on Mar 26 2026 7:46 AM

● మునిసిపాలిటీల్లో వార్డుల పెంపుపై కసరత్తు ● జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన

చిత్తూరు అర్బన్‌: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులను పెంచడంతోపాటు జనాభా ప్రాతిపదికన వార్డులను పునర్భజన చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలన – పట్టణాభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు గ్రేడ్ల ఆధారంగా ఉన్న వార్డులు, డివిజన్లను తాజాగా జనాభా ప్రామాణికంగా వర్గీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వార్డుల పెంపు ఇలా..

జనాభా ఆధారంగా వార్డుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 2 లక్షలలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లలో 60 డివిజన్లు ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో చిత్తూరు కార్పొరేషన్‌లో ఇప్పటి వరకు ఉన్న 50 డివిజన్ల సంఖ్య 60కి చేరుకోనుంది. పలమనేరులో 26 ఉన్న వార్డులు 40కు, నగరిలోని 29 వార్డులు 40కి చేరుకోనున్నాయి. వార్డుల పునర్విభజన ఎలా చేయాలనేదానిపై ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు అందాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాతే అధికారులు వార్డుల స్వరూపం మార్చడంతో పాటు, గెజిట్‌ ప్రచురించడం, ఆపై ప్రజల నుంచి అభ్యతరాలు స్వీకరించడం చేయాలి. తుదిగా వార్డుల సంఖ్య పెంచుతూ, పునర్విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. వచ్చే ఏడాది జనగణన పూర్తయ్యి, మునిసిపల్‌ ఎన్నికలకు వెళ్లేలోపు కొత్త వార్డులు–డివిజన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిబంధనలు..

2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికే అమలులో ఉన్న వార్డులు, డివిజన్ల సంఖ్య తదుపరి జనగణన ఫలితాల వరకు మార్చకూడదు. ఇక పాలకవర్గాలు (కౌన్సిల్‌) ఉన్న చోట పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తగా పెరిగిన వార్డులు అమలులోకి వస్తాయి. ఈ లెక్కన కుప్పం మునిసిపాలిటీలో సెప్టెంబరు తర్వాతే వార్డుల సంఖ్య పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement