ప్రభుత్వ విధానాల రూపకల్పనకు జనగణన డేటా కీలకం నాణ్యతతో కూడిన డేటా సేకరణే లక్ష్యంగా పని చేయాలి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జనగణన ప్రక్రియను పట్టిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. జనగణన ప్రక్రియలో శిక్షణ అత్యంత కీలకమన్నారు. మండల స్థాయి సిబ్బందిని 5 నుంచి 6 ఆరుగురితో చిన్న చిన్న బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇవ్వాలన్నారు. తద్వారా ప్రతి ఒక్కరికీ జనగణనపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. జనణనలో సేకరించిన వివరాలు రాబోయే 10 నుంచి 15 ఏళ్ల వరకు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక విధానాల అమలుకు జనగణన వివరాలే ప్రాతిపదికన్నారు. జిల్లా స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సందేహాల నివృత్తికి ముఖ్య అంశాలతో కూడిన లీఫ్‌లెట్లు, ప్రశ్నోత్తరాల పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రైనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్ కుమార్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ దీపక్ భరద్వాజ్, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.


