అస్తవ్యస్తంగా 104 సేవలు
సేవలకు దూరమవుతున్న వైద్యులు
ఎంఎల్‌పీహెచ్‌లే డాక్టర్లు..
తప్పుడు ఓపీలు నమోదు చేస్తున్న వైనం
వేధిస్తున్న మందుల కొరత
కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాల మాట దేవుడెరుగు. కనీస వైద్యం కూడా అందని ద్రాక్షలా మారుతోంది. పేదలకు గ్రామాల్లోనే వైద్యసేవలు అందించడానికి ఉద్దేశించిన 104 సంచార వైద్యానికి గండమొచ్చింది. చిత్తూరు జిల్లాలో 104 సేవల పరిస్థితి దయనీయంగా మారింది. పల్లెల్లో సేవలు తుస్‌మనిపిస్తున్నాయి. ఎల్‌హెచ్‌పీలు వైద్యులుగా మారుతున్నారు.
104 వాహనాల డ్రైవర్లు ల్యాబ్ టెక్నీషియన్లుగా అవతారమెత్తుతున్నారు. ఆశావర్కర్లు బీపీ, మధుమేహం పరీక్షలు చేస్తున్నారు. తప్పుడు ఓపీలు నమోదు చేస్తున్నారు. ల్యాబ్ టెస్టులకు తిలోదకాలు ఇస్తున్నారు. పేదలకు తూతూమంత్రంగా వైద్యం అందించి మందులు, మాత్రలతో సరిపెడుతున్నారు. ఫలితంగా పేదలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో 104 వాహనాలు 39 ఉన్నాయి. ఇవి జిల్లాలోని 614 విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు నెలకు రెండుసార్లు చొప్పున వెళ్లాలి. వీటి ద్వారా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. సచివాలయం లేదా కమ్యూనిటీ హాళ్లలో ఈ శిబిరాలు నిర్వహించాలి. వైద్య సేవల్లో డ్రైవర్, డీఈవో, ఏఎన్‌ఎం, ఆశావర్కర్, ఎంఎల్‌హెచ్‌పీలు, మెడికల్ ఆఫీసర్, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొనాల్సి ఉంది.
స్థానిక పీహెచ్‌సీ నుంచి మెడికల్ ఆఫీసర్ శిబిరంలో పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించాలి. ముఖ్యంగా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి ప్రాథమిక స్థాయి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వాలి. గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య పరిశీలన, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ, రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి సమీప ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయాలి. దగ్గరలో ఆస్పత్రి సదుపాయం లేని ప్రజలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణకు 104 వాహన సేవలు దోహదం చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ సేవలు తూతూమంత్రంగా అందిస్తున్నారు.
ఉత్తుత్తి పరీక్షలు
104 వాహనంలో అరకొర వైద్య పరీక్షలతోనే సరిపెడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు బదులు ఏఎన్‌ఎంలు, డ్రైవర్లు రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. జ్వర నిర్ధారణ, మధుమేహం, రక్తపోటు, యూరిన్ అల్బమిన్, ఈసీజీ, హెచ్‌బీ, సాధారణ రక్త పరీక్షలతో సరిపెడుతున్నారు. తాజా 104 వైద్య సేవల కాంట్రాక్టులో 21 పరీక్షలు నిర్వహిస్తామని కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చేస్తున్న పరీక్షలకు కూడా ఒక విధానం అంటూ లేదు. అదే మాదిరిగానే నిబంధనల ప్రకారం 104 సిబ్బంది గృహ సందర్శనలు చేయాలి.
మంచానికే పరిమితమైన రోగులకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలి. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, పోషకాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి వారిని పోషకాహార కేంద్రానికి తరలించాలి. తగిన బరువు పెరిగేలా ప్రత్యేక చొరవ చూపాలి. ఈ సేవలు 104 ద్వారా అందడం లేదు. వైద్యం అందక పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రైవేటు వైద్యం జోలికెళ్లలేకపోతున్నారు. వైద్య సేవల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యమంటూ పెదవి విరుస్తున్నారు.
శిబిరాలకు వైద్యుల డుమ్మా
104 వాహనాలు వెళుతున్న ప్రతి గ్రామానికీ స్థానిక మెడికల్ ఆఫీసర్ (ఎంవో) వెళ్లాలి. చాలా మంది వైద్యులు రాకుండానే వచ్చినట్లు ఫేక్ హాజరు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోగులకు ఎంఎల్‌హెచ్‌పీలే వైద్యం చేసి పంపిస్తున్నారు. చాలా 104 వాహనాల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఈసీజీ సహా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం కష్టతరమవుతోంది.
ఉక్కపోతతో ఉడికిపోతూ ఎంత త్వరగా పరీక్ష పూర్తవుతుందా, వాహనం నుంచి బయటపడతామా అనే పరిస్థితి రోగుల్లో నెలకొంది. నిండు గర్భిణుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొన్ని వాహనాల్లో పరికరాలు లేక వైద్య పరీక్షలకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్ని వాహనాల్లో అవి ఉన్నా వాడడం లేదు. అదేవిధంగా హెవీ వెహికల్ లైసెన్సులేని డ్రైవర్లను నియమించుకుంటున్నారు. ఇలా తూతూమంత్రంగా వైద్యం చేస్తూ పల్లె ప్రజలకు మరింత హానిచేస్తున్నారు.
తప్పుడు ఓపీలు
చాలాచోట్ల 104 వాహనాల్లో ఓపీకి రోగులు రాకుండానే వచ్చినట్టు తప్పుడు ఓపీలు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిరీ్ణత లక్ష్యాన్ని చేరుకోవడానికే ఇలా చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా చేయాల్సిన క్లోరినేషన్ పరీక్షల ఊసే లేదు.
స్థానిక సచివాలయ ఇంజినీర్ ఆయా గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో నీటిని పరీక్షించి పీహెచ్ విలువ తెలియజేయాలి. వాటిని సంబంధిత పోర్టల్‌లో 104 డీఈవో అప్‌లోడ్ చేయాలి. ఈ పరీక్షలు జరగకపోవడంతో చేతికొచ్చిన తప్పుడు విలువలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తప్పుడు లెక్కల ఆధారంగానే ప్రభుత్వం తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
పట్టి పీడిస్తున్న మందుల కొరత
గ్రామాలకు 104 వాహనంలో ఆల్బెండజోల్ సస్పెన్షన్, అల్యూమినియం హైడ్రోక్లోరైడ్, మెగ్నీషియం+సమిథికాన్ సిరప్, ఆంట్రాక్సోల్ సిరప్, ఎమోక్సిసిలిన్ క్యాప్సుల్స్, ఎటెనిరాల్, బెం జోయిక్ యాసిడ్–సాల్సిలిక్ యాసిడ్ ఆయింట్‌మెంట్, బిమటోఫ్రాస్ట్ ఐ డ్రాప్స్, సిఫిక్సిమ్ సస్పెన్షన్, సిప్రోఫ్లోక్సాసిన్ ఇయర్, ఐ డ్రాప్స్, క్లోట్రిమోజోల్ క్రీము, డాంపెరిటోన్ సస్పెన్షన్, ఇటో ఫైలిన్–రి యోఫైలిన్ ఇంజక్షన్, ఫ్రామిసైటిస్ సల్ఫేట్ క్రీమ్, ప్రామిసైటిన్+డెక్సామిథాజోన్+కోట్రిమజోల్ ఆయింట్‌మెంట్, ఫెరాక్రీలం అయింట్‌మెంట్, ప్యూరాజోలిడాన్ సస్పెన్షన్, లివోసిట్రిజిన్ సిరప్, లివో సిట్రిజిన్ మాంటీలుకాస్ట్ ట్యాబ్లెట్స్, మెట్రోనిడజోల్ సస్పెన్షన్, మెట్రోనిడజోల్ 400 ఎంజీ ట్యాబ్లెట్స్, మినరల్ ఆయిల్–హైడ్రాక్సీ ప్రొఫైల్ సంయుక్త ఐ లూబ్రికెంట్, ఓఆర్‌ఎస్, పారాసిటమాల్ ఇంజక్షన్లు, ప్రీమెతిరిన్ క్రీమ్, పావిడన్ ఆయోడిన్ 5 శాతం అయింట్‌మెంట్, టెల్మిసార్ధన్ 40 తదితర మందులు ఉండడం లేదు.
సిరంజీల్లో 2 సీసీ, 5 సీసీ లేవు, ఐవీ సెట్లు, బ్యాండ్ ఎయిడ్లు 10, 15 సెంటీమీటర్లు, టార్న్ క్విట్ పీడియాట్రిక్ లింబ్స్, పేపర్ ప్లాస్టర్ 3 ఇంచ్, గ్లాజులు మీడియం, లార్డ్, డిస్పోజబుల్ గ్లాజులు, డిజిటల్ బీపీ మెషిన్ కూడా లేకుండానే 104 సేవలను కొనసాగిస్తున్నారు. మందుల కొరతతో కొన్నిచోట్ల షార్ట్ ఎంక్వైరీ మందులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని కొందరు సిబ్బంది వాపోతున్నారు. డ్రగ్స్ స్టోర్ నుంచే స్టాక్ రావడం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు.


