పలమనేరు: పూర్వపు పలమనేరు రెవిన్యూ డివిజన్‌లోని సదుం మండలం కభంవారిపల్లి పంచాయతీ చింతపర్తివారిపల్లి వద్ద గత వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో కొత్త చెరువు ప్రాజెక్టును నిర్మించింది. దీని నిర్మాణం కోసం అక్కడి రైతు ల నుంచి భూములను ఎల్‌ఏ ద్వారా సేకరించారు. కానీ వారికి ఆపై నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. వీరిలో కొందరు హైకోర్టుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఇక్కడి రెవెన్యూ అధికారులు వెంటనే పరిహారాన్ని రైతులకివ్వాలని ఆదేశించడంతో ఇప్పుడు దారిలోకి వచ్చిన అధికారులు ఈ పనులను చేపడుతున్నారు. వీరిలోనూ కొందరికి పరిహారం దక్కలేదు. దీంతో వీరు స్థానిక ఆర్‌డీఓ కార్యాలయం వద్ద అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతపర్తివారిపల్లి వద్ద పచ్చార్లొంకపై గత వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం కొత్త చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి పూను కుంది. ఇందుకోసం ఆ ప్రాంతంలోని 82 ఎకరాల పట్టాభూములు, 43.53 ఎకరాల డీకేటీ భూములు, 52 ఎకరాల ప్రభుత్వభూమి మొత్తం 176 ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరించారు. ఇందుకు నష్టపరిహారంగా బాధిత రైతులకు రూ.13.76 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే పరిహారం ఇవ్వకుండా రైతులను పరిహాసం చేశారు. దీనిపై ఆగ్రహించిన వై.లక్ష్మమ్మతోపాటు మరో 65మంది పిటిషనర్లుగా ఇరిగేషన్‌శాఖ, సీఈఓ ఇరిగేషన్, కలెక్టర్, ఆర్‌డీఓ, సదుం తహశీల్దార్, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతివాదులుగా చేస్తూ హైకోర్టులో 2024లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం బాధితులకు అవార్డు పాసైనప్పటినుంచి ఇప్పటిదాకా ఏడాదికి 12శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని అధికారులు పట్టించుకోలేదు. దీంతో రైతులు కోర్టు ధిక్కరణకు వెళ్లగా తాజాగా హైకోర్టు అక్షింతలు వేయడంతో పరిహారం ఇచ్చేందుకు అధికారులు పూనుకున్నారు.
మరో తిరకాసు
మొత్తం బాధిత రైతుల్లో 88 మందికి రూ.8కోట్ల దాకా పరిహారం దక్కింది. పరిహారం దక్కని రైతులు సోమవారం స్థానిక ఆర్‌డీఓ కార్యాలయం వద్దకొచ్చి సదుం రెవెన్యూ అధికారులకు డబ్బులిచ్చిన వారికి మాత్రం పరిహారం ఇస్తూ తమలాంటిి పేదలకు అన్యాయం చేశారంటూ ఆరోపించారు. ఆర్‌డీఓ వీరికి నచ్చజెప్పినా పట్టించుకోలేదు. సదుం మండల తహశీల్దార్‌తోపాటు వీఆర్‌ఓ దాకా తమ సమస్యకు కారణమంటూ ఆరోపించారు.
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో చింతపర్తివారిపల్లి వద్ద నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టు , వడ్డీతో పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు
అందరికీ న్యాయం చేస్తాం
కొంతమంది రైతులు వచ్చి రకరాకాల ఆరోపణలు చేసిన మాట నిజమే. కానీ మొత్తం రైతుల్లో అన్ని బ్యాంకు ఖాతా నెంబర్లు కరెక్ట్‌గా ఉన్నవారి ఖాతాలకు అవార్డు జమ అయింది. కొందరు రైతులు గతంలో గ్రామీణ బ్యాంకు ఖాతాలను ఇచ్చారు. అయితే ఆ బ్యాంకు ఇప్పు డు కెనరా బ్యాంకుతో కలిసినందున ఖాతాలు మారా యి. సీఎఫ్‌ఎంఎస్‌లో ఖాతాలకు సంబంధించిన సమస్యలతో రిజెక్ట్ అయినమాట నిజ మే. చాలామందికి డాక్యుమెంట్లు, ఖాతాలను అప్‌డేట్ చేశాం. మిగిలినవారి సమస్యలను పరిష్కరిస్తాం. అయి తే ఈ వ్యవహారంలో అధికారులు మామూళ్లు తీసుకున్నారనేది నిజం కాదు. – భవానీ, ఆర్‌డీఓ, పలమనేరు


