ప్రకృతి వ్యవసాయం ఆ రైతు కుటుంబ లక్ష్యం దశాబ్ద కాలంగా వర్మీకం పోస్టు కేంద్రం నిర్వహణ సాటి రైతులను ప్రకృతి సేద్యం వైపు నడిపిస్తున్న దంపతులు
పుత్తూరు: మండలంలోని రామసముద్రం గ్రామానికి చెందిన ఎస్.మహేశ్వరరావు, పద్మావతి దంపతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రైతు కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. మహేశ్వరరావుకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించి పదేళ్ల క్రితమే మొదలు పెట్టారు. మనం అందించే వ్యవసాయ ఉత్పత్తులు ఆకలిని తీర్చడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలన్నది ఆ దంపతుల ఆశయం. ఇందుకు వర్మీకంపోస్టును ఎంచుకున్నారు. దీంతో పాటు జీవామృతం, ఘనజీవామృతాలను గత పదేళ్లుగా తామే తయారు చేస్తూ, ఇతర రైతులకు విక్రయిస్తూ, తామూ వినియోగిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలా వర్మీకంపోస్టు తయారీ కేంద్రాలు మరో రెండు చోట్ల మాత్రమే ఉండడం గమనార్హం. రామచంద్రాపురం మండలం, బ్రాహ్మణ కాల్వలో రామ్మోహన్‌నాయుడు, వడమాలపేట మండలం, వేమూరులో అయ్యప్పనాయుడు వర్మీకంపోస్టులను నిర్వహిస్తున్నారు.
జీవామృతం తయారీ ఇలా..
ఆవులను పెంచాలి
ప్రతి రైతు ఆవులను పెంచాలి. నా తల్లిదండ్రులు నిర్మాలాదేవి, వెంకటాచలంనాయుడు నాకు 50 దేశీయ ఆవులనిచ్చారు. నేను వాటిని 70కి పెంచాను. నా భార్య పద్మావతి ప్రకృతి సేద్యం చేయడంలో పూర్తి సహకారం అందిస్తోంది. ఇద్దరం కలసి ఆవు పేడతో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నాం. పంటల సాగులో దానిని వినియోగిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నాం. మనం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకొనే ఆహారం విషతుల్యం కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన పంటలు తయారు పండించడానికి ప్రతి రైతు ముందుకు రావాలి. వర్మీకంపోస్టును స్వయంగా తయారు చేస్తున్నాం. పలువురికి విక్రయిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – ఎస్.మహేశ్వరరావు, పద్మావతి,
వర్మీకంపోస్టు తయారీదారి దంపతులు, రామసముద్రం, పుత్తూరు మండలం
కూరగాయలు పండించాలి
ప్రస్తుత సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయమే మార్గం. ప్రతి కుటుంబం 15 రకాల కూరగాలను పండించే విధానాన్ని అందిపుచ్చుకోవాలి. 1996లో తిరుపతిలో ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంస్థ (వర్డ్) ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కోసం పనిచేస్తున్నాం. ఈ కోవలో నడుస్తున్న రైతులందరికీ ప్రభుత్వం తనవంతు సహకారం అందించాలి. అలాగే హైస్కూల్ నుంచి యూనివర్సీటీ విద్యార్థుల వరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అలవాటు చేయాలి.
– డాక్టర్ కె.గంగాధరం, కార్యదర్శి, వర్డ్, తిరుపతి
ఆ దంపతులకు ప్రకృతి సేద్యంపై మక్కువ ఎక్కువ. వర్మీకంపోస్టు, జీవామృతం ద్వారా వ్యవసాయం చేయడంలో ముందుంటారు. గత పదేళ్లుగా వర్మీకంపోస్టును తయారు చేస్తునానరు. దాన్ని నిస్సారమైన భూముల్లో సైతం వినియోగిస్తూ తద్వారా ఆ భూములను సారవంతం చేసి పునరుజ్జీవం పోస్తున్నారు. తాము తయారు చేసిన వర్మీకంపోస్టును ఇతర రైతులకూ విక్రయిస్తూ, వారిని ప్రకృతి సేద్యం పైపుగా నడిపిస్తున్నారు. వారే పుత్తూరు మండలానికి చెందిన మహేశ్వరరావు, పద్మావతి దంపతులు. వర్మీకంపోస్టు, జీవామృతం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు.


