కొండచుట్టూ మండపం విషయంలో గాడిదలు కాసింది ఎమ్మెల్యే, ఆయన తండ్రే? ప్రజలకు మంచి చెయ్యాలనే తపన ప్రస్తుత ప్రభుత్వానికి లేదు దోచుకుందాం.. దాచుకుందాం ఇదే రెండేళ్లుగా జరుగుతున్న తీరు ఏం కావాలో అడిగి చేసే రోజులు పోయాయి తిరుమల ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలి మాజీ మంత్రి ఆర్కేరోజా మండిపాటు
మూడేళ్లలో చేసిన అభివృద్ధి..
చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలి
నగరి : గత ప్రభుత్వంలో తొలి రెండేళ్లు కరోనా తీవ్రతతో గడచిపోగా మిగిలిన మూడేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, మూడు దశాబ్దాలుగా పాలించిన వారు ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోయారని మాజీ మంత్రి ఆర్కేరోజా నిలదీశారు. ప్రజలకు మంచి చెయ్యాలనే తపన ప్రస్తుత ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. ఆదివారం తన నివాస కార్యాలయంలో ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న పుత్తూరు మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ఆమె సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తీవ్రతతో గడిచిపోయిందన్నారు. ఆ సమయంలో ప్రజలకు తామందరం ఎంతో అండగా నిలిచామన్నారు. మిగిలిన మూడేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో తాజ్‌మహల్ లాంటి షాదీమహల్ కట్టించామని, పార్కు, పాలిటెక్నిక్ కళాశాల, క్రిమేషన్ షెడ్డు, అర్బన్ హెల్త్ సెంటర్లు, మున్సిపల్ కార్యాలయం, ఆస్పత్రి నవీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. గతంలో పాలించిన నాయకులు వీటిని ఎందుకు చెయ్యలేక పోయారన్నారు. నియోజకవర్గ కేంద్రం నగరిలో టీటీడీ కల్యాణ మండపం లేదని, వడమాలపేట మండలంలో ప్రసిద్ధి చెందిన టీటీడీ ఆలయం ఉన్నా అక్కడ టీటీడీ మండపం లేదని గతంలో ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. నేత్ర దేవత దేశమ్మ దేవత ఆలయం నుంచి పలు ఆలయాలు నిర్మించామని గతంలో ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ఇవి చెయ్యాలంటే ప్రజలకు మంచి చెయ్యాలనే తపన వారికుండాలన్నారు. జగనన్న నుంచి పొందిన స్ఫూర్తితో తాను చెయ్యగలిగానన్నారు. తోపు..తురుము అని చెప్పుకునే నాయకు లు ఎందుకు వీటిని చెయ్యలేకపోయారో ప్రజలే ఆలోచించాలన్నారు. కట్టిన షాదీమహల్‌ను వినియోగంలోకి తేలేని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానిదన్నారు. వినియోగంలోకి తెస్తే ఎక్కడ రోజమ్మకు పేరొస్తుందోనని అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆయన చివాట్లు పెట్టినా వినియోగంలోకి రాలేదన్నారు. మరోమారు ఈ విషయమై గత మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌ను సంప్రదిస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పుత్తూరు ఆస్పత్రికి రూ.9 కోట్లు మంజూరు చేసుకొని రాగా దానిని సత్యవేడుకు పంపి పుత్తూరుకు రూ.1.5 కోట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే తండ్రిదన్నారు. వారు తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆనందపడుతూ పుత్తూరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అవసరం లేని చోట ఫ్‌లై ఓవర్ కట్టి ప్రజలను ఇబ్బంది పడేలా చెయ్యడం మినహా ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యేగానీ, ఆయన తండ్రిగానీ ఎందుకు అభివృద్ధి పనులు చెయ్యలేక పోయారన్నారు. ప్రజలే ఈ విషయం గ్రహించి నేడు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు.
కొండచుట్టు
మండపం విషయంలో ..
పవిత్ర కొండచుట్టు మండపాన్ని రహదారి వెడల్పులో పోకుండా కాపాడుకుందామని వెళితే 2023లో గాడిదలు కాస్తున్నారా ? అంటూ ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడటంపై మాజీ మంత్రి రోజా స్పందిస్తూ జాతీయ రహదారి పనులు మంజూరై భూముల స్వాధీనానికి టెండర్ వదిలింది 2008 ఆగస్టు నెల 20వ తేదీన అన్నారు. దానికి సంబంధిత పత్రికా ప్రకటనలను చూపారు. అయితే రోడ్డు పనులు చేపట్టలేదన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతుంటే ఢిల్లీ వరకు వెళ్లి 2023లో ఆగిన పనులకు చలనం తెచ్చి రోడ్డు పనులను తాను ప్రారంభించానన్నారు. 2008లో సర్వే చేసిన మేరకు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. నాడు నగరిలో ఒక సీనియర్ నాయకుడు, పుత్తూరులో ప్రస్తుత ఎమ్మెల్యే తండ్రి ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. ఆపై టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారే ఉన్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఆయన తండ్రి వెంట తిరుగుతూ ఉన్నాడన్నారు. అప్పుడు చేసిన సర్వేలో మండపం తొలగించేలా ఉంటుందని వీరికి తెలియదా అని మాజీ మంత్రి రోజా సూటిగా ప్రశ్నించారు. 2008లో ఎవరు పాలకులు ఉన్నారో తెలియని అజ్ఞానంలో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. నిజానికి కొండచుట్టు మండపం విషయంలో గాడిదలు కాసింది ఎమ్మెలే, ఆయన తండ్రే అన్నారు.
అవాంతరాలు ఎదురైనా
మండపాన్ని కాపాడుతా?
రోడ్డు విస్తరణ పనుల్లో మహానేత వైఎస్సార్ విగ్రహం తొలగించే సమయంలోనే కొండచుట్టు మండపం కూలుస్తారనే విషయాన్ని నాయకులు చెప్పారని వెంటనే ఆ విషయంలో తాను చైన్నెకి వెళ్లి జాతీయ రహదారి ప్రాజెక్టు అధికారులతో చర్చించడం, కోర్టుకు వెళ్లి స్టే తేవడం జరిగిందని మాజీ మంత్రి తెలిపారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కారిని కూడా కలవడం జరిగిందన్నారు. దానిపై నేటి వరకు పోరాడుతున్నానని కొండచుట్టు మండపం కాపాడే బాధ్యతను నేను తీసుకున్నానన్నారు. అయితే దానిపై చర్యలు చేపట్టాల్సిన ఎమ్మెల్యే.. ఆవిడ తలచుకుంటే మండపాన్ని కాపాడేస్తుందా అంటూ పలువురి వద్ద ఎద్దేవా చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ కొలవుదీరే 21 మంది దేవతల ఆశీర్వాదం తనకు ఉంటుందన్నారు. తప్పక మండపాన్ని కాపాడగలుగుతానన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు ప్రజల కోసం పనిచేసే టైం లేదన్నారు. ఒక డిపార్ట్‌మెంట్ చినబాబు చూసుకుంటే.. మరో డిపార్ట్‌మెంట్ బాలగోపాల్ చూసుకుంటున్నారని, దోచుకుందాం, దాచుకుందాం అన్నరీతిన పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక్క కొండ కూడా వదల్లేదని కొండలన్నీ క్వారీలకు అప్పగించి గ్రావెల్, కంకర, ఇసుక అంటూ అన్నీ దోచుకుంటున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో క్వారీల్లో ఏ మేరకు వనరులు తీశారో, ప్రస్తుతం రెండేళ్లలోనే ఎంత తీశారో లెక్కిస్తే తేలిపోతుందన్నారు.
తిరుమల ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలని మాజీ మంత్రి ఆర్కేరోజా విమర్శించారు. అబద్దాలతో అధికారపీఠం ఎక్కిన ఆయన ..చేసింది ఏమీ లేదన్నారు. సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతిలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పింఛన్లు లేవని ఏ హామీ నెరవేర్చకుండా తాను అధికారంలోకి వచ్చాకా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పడం కన్నా మరో విడ్డూరం ఏదీ లేదన్నారు. మన జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన తిరుమలనే అపవిత్రం చేస్తున్న చంద్రబాబు జిల్లాలో పుట్టినందుకు జిల్లావాసులు సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. టీడీపీ, జనసేన నాయకులు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని వారి కింద ఉన్న స్క్రాప్‌తో ప్రెస్ మీట్ పెట్టించడం, తిట్టించడం మాత్రమే చేస్తున్నారన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు మంచి చేయడం, మనం చేసిన అభివృద్ధి పనులు వారికి తెలియజేయడం పార్టీ శ్రేణుల కర్తవ్యమన్నారు. తమకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా పదవి బాధ్యతలు పూర్తిచేసుకున్న కౌన్సిలర్లు గజమాలతో మాజీ మంత్రి రోజాను సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, పార్టీ లీగల్‌సెల్ కన్వీనర్ రవీంద్ర, పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


