జిల్లాలో అదుపు తప్పుతున్న
డయాగ్నోస్టిక్ కేంద్రాలు
రిజిస్టర్ కానివి అనేకం..
అనవసరంగా టెస్టులు
టెస్టుకు రూ. 600 నుంచి రూ. 10 వేల వరకు ఫీజులు
కనిపించని ధరల పట్టిక
టెస్టుకు రూ. 200 నుంచి రూ. 250 వరకు ఆస్పత్రుల కమీషన్
పర్యవేక్షణ కరువు..చోద్యం చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ల్యాబ్‌ల వ్యవహారం నియంత్రణ తప్పి దోపిడీ స్థాయికి చేరుకుంది. అడ్డ గోలుగా అమాయకుల రక్తాన్ని గుంజేస్తున్నాయి. రోగుల రక్తమే ఆదాయ మార్గంగా మార్చేశాయి. ప్రజ ల ఆరోగ్యంపై ఆధారపడి నడవాల్సిన ఈ వ్యవస్థ, ఇప్పుడు పూర్తిగా వ్యాపార ధృక్పథంతో నడుస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పక్కనపెట్టి అనేక ల్యాబ్‌లు ఇష్టారాజ్యంగా సేవలు అందిస్తూ రోగులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. ఈ దందా వైద్య ఆరోగ్య శాఖ కళ్లగప్పగించుకుని చూస్తోందనే విమర్శలు భగ్గుమంటున్నాయి.
ప్రజల భయమే పెట్టుబడి
సాధారణ ఆరోగ్య సమస్యలకే ‘పెద్ద సమస్య కావచ్చు’ అని భయపెట్టి టెస్టులు చేయించుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆరోగ్యంపై ఉన్న భయాన్ని ల్యాబ్‌లు తమ లాభాలకు ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు జరగకపోవడం, ఫిర్యాదులపై స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్త మవుతోంది.
‘ఆఫర్ల’ పేరుతో మాయాజాలం
‘‘ఫుల్ బాడీ చెకప్ ఆఫర్’’, ‘‘డిస్కౌంట్ ప్యాకేజ్’’ వంటి ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తున్న ల్యాబ్ లు, ఆ తర్వాత అవసరం లేని అదనపు టెస్టులు జోడించి భారీగా బిల్లులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భయం, అనుమానం కలిగించేలా మాట్లాడి టెస్టు లు చేయించుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాబ్‌ల దందాలో అత్యంత కీలక అంశం కమిషన్ వ్యవస్థ. కొన్ని ఆస్పత్రులు, డాక్టర్లు, సిబ్బంది ల్యాబ్‌లతో కుమ్మకై ్క ప్రతి టెస్ట్‌పై రూ.200 నుంచి రూ.250 వరకు కమీషన్ పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డెమోను డమ్మీ చేసేశారు..
ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, స్కానింగ్ సెంటర్, ల్యాబ్‌ల పర్యవేక్షణ ఒకప్పుడు డెమో విభాగం చేతిలో ఉండేది. అడపాదడప పర్యవేక్షణ చేస్తూ...తప్పిదాలను సరిదిద్దేలా చర్యలు చేపట్టేవారు. అయి తే రెండేళ్ల కాలంలో ల్యాబ్ పర్యవేక్షణ శూన్యమైంది. రిజిస్ట్రేషన్ లేని ల్యాబ్‌లను గాలికొదిలేశారు. రెన్యూవల్‌ను ఆమాడదూరంలో పెట్టేశారు. వీటి నుంచి కమీషన్లు తీసుకుంటూ...గప్‌చుప్ అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాఖలోని ఓ ఉన్నతాధికారికి అంటకాగిన సిబ్బంది రిజిస్ట్రర్‌కానీ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్, ల్యాబ్‌లను తన గుప్పెట్లో పెట్టుకుని మామూళ్ల మత్తులో ఉండిపోతున్నారని శాఖలోని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి.. అడ్డగోలు వ్యాపారానికి చెక్‌పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ల్యాబ్‌లో రక్త నమూనాలను పరీక్షిస్తున్న దృశ్యం (ఫైల్)
అనవసర టెస్టులతో.. భారీ బిల్లులు
చిన్న సమస్యలకే పెద్ద పెద్ద టెస్టులు రాయించడం ఇప్పుడు సాధారణమైంది. వైద్య అవసరం లేకపోయినా ప్యాకేజీల పేరుతో రోగులకు టెస్టులు సూచిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఒక్కో టెస్ట్‌కు రూ.600 నుంచి ప్రారంభమై, కొన్ని సందర్భాల్లో రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మధ్య తరగతి, పేద కుటుంబాలు ఈ ఖర్చులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి ల్యాబ్‌లో టెస్టుల ధరల జాబితా ప్రదర్శించాలి. కానీ చాలా ల్యాబ్‌లలో ఈ నియమం అమలు కావడం లేదు. రోగి అడిగితేనే ధర చెబుతూ, ప్రతి ఒక్కరికి వేరువేరు రేట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ లేకుండా వందల ల్యాబ్‌లు
జిల్లాలో పనిచేస్తున్న ల్యాబ్‌లలో గణనీయమైనవి సరైన రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్నాయి. జిల్లా లో అధికారికంగా సుమారు 500పైనే ల్యాబ్‌లున్నా యి. అయితే వీటిలో కూడా రెవెన్యూవల్ కానివి వందల్లో ఉన్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కానివి జిల్లా వ్యాప్తంగా 300పైనే ఉండవచ్చునని అధికారులు అంచనా వేశారు. చాలా మంది ఇంట్లోనే ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుని...కొన్ని ఆస్పత్రులకు కమీషన్ల పేరుతో ఎరవేస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా ల్యాబ్ టెస్టులు పుంజుకుంటున్నాయి. చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడివీధి, సుందరయ్యవీధి, సుబేదారువీధి, దర్గా సర్కిల్, గురునగర్ కాలనీ, కొంగారెడ్డిపల్లి, మిట్టూరు, తోటపాళ్యం, జిల్లా ప్రభుత్వ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. వీటిలో చాలా వరకు కనీస ప్రమాణా లు పాటించకుండా టెస్టులు నిర్వహించడం వల్ల ఫలితాల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రోగుల చికిత్స కూడా తప్పు దోవ పట్టే ప్రమాదం ఉంది.


