చిత్తూరు కలెక్టరేట్: జనగణనపై నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు క్షేత్రస్థాయి ట్రైనర్లు తప్పనిసరిగా హాజరు కావాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు/స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న 70 మందిని క్షేత్రస్థాయి ట్రైనర్లుగా నియమించామన్నారు. మొదటి విడతలో ఈనెల 23, 24, 25 తేదీల్లో కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లలో శిక్షణ ఉంటుందన్నారు. రెండో విడతలో ఈనెల 26, 28, 29 తేదీల్లో చిత్తూరు డివిజన్ క్షేత్రస్థాయి ట్రైనర్లకు శిక్షణనివ్వనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి ట్రైనర్లు ఆ తర్వాత ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన వివరించారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బాట గంగమ్మ గుడి వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 77,864 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,348 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


