పలమనేరు(చిత్తూరు జిల్లా): ఆయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మె ల్యే టీసీ రాజన్ (107) రెండ్రోజుల క్రితం అనా రోగ్యంతో బెంగళూరులోని ఆస్పత్రిలో మృతి చెందితే పలమనేరులో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. దేశం కోసం స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం స్థానిక తహసీల్దార్ సైతం అంత్యక్రియలకు హాజరు కాకపోవడం గమనార్హం. దీంతో కుటుంబీకులు, బంధువులు, స్థానికులే ఆఖ రి మజిలీని చేపట్టారు. గతంలో ఆయన బతికున్నప్పుడు జిల్లాలో జరిగే రిపబ్లిక్‌డే, పంద్రాగ స్టు వేడుకలకు ముఖ్య అతిథిగా పిలిచి సన్మానించిన కలెక్టర్లు ఆయన మరణించాక ఎందుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదనే మాట సాధారణ జనం ప్రశ్నిస్తున్నారు.
సాధారణ వ్యక్తిలా టీసీ రాజన్‌కు అంత్యక్రియలను నిర్వహిస్తున్న దృశ్యం పలమనేరులోని రాజన్ అద్దె ఇల్లు
నిజాయితీ గల నేత
పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం రాయలపేటలో 1918లో రాజన్ జన్మించారు. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా స్వతంత్ర పార్టీ తరపున గెలుపొంది ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుడిగా , ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను తీర్చిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బతుకు ఇబ్బందిగా మారినా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఉండేందుకు ఇల్లులేక, అద్దె ఇంట్లో బతికారు. తనకు రావాల్సిన పింఛనుకు సంబంధించి లంచం ఇవ్వడానికి మనసు రాక దశాబ్ధకాలంగా కలెక్టరు కార్యాలయం నుంచి భారత రాష్ట్రపతి వరకు తిరిగినా లాభం లేకుండా పోయింది. గతంలో టీడీపీ పాలనలో పంద్రాగస్టు వేడుకలకు తిరుపతికొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఫ్రీడం ఫైటర్స్‌కు రూ.15 వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాలు అమలుకాలేదు.


