టమాట గుజ్జు.. ఫ్యాక్టరీల మోజు | - | Sakshi
Sakshi News home page

టమాట గుజ్జు.. ఫ్యాక్టరీల మోజు

Mar 22 2026 1:54 AM | Updated on Mar 22 2026 1:54 AM

● జిల్లాలో టమాట పేస్ట్‌ తయారీపై పరిశ్రమలు ఆసక్తి ● 10 ఫ్యాక్టరీలు టమాట పేస్ట్‌ తయారీలో బిజీ బిజీ ● దేశవ్యాప్తంగా అమ్మకాలు

కాణిపాకం: టమాట గుజ్జుపై ఫ్యాక్టరీలు మొగ్గు చూపుతున్నాయి. పది ఫ్యాక్టరీలు టమాట పేస్ట్‌ తయారీలో బిజీగా ఉంటున్నాయి. రోజువారీగా 1500 నుంచి 1700 టన్నులు సేకరిస్తున్నాయి. మరో 2 వేల టన్నుల కాయలొచ్చినా పేస్ట్‌ తయారీకి సిద్ధంగా ఉన్నాయి. మార్కెటింగ్‌ సులభం కావడంతో పేస్ట్‌ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. టమాట పంట విస్తీర్ణం పెరగడంతో మార్కెట్‌లో ధరలు పడిపోతుండగా, పళ్లగుజ్జు పరిశ్రమలు మాత్రం ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్నాయి. సాధారణంగా మామిడి సీజనన్‌ కు మాత్రమే పరిమితమయ్యే ఈ యూనిట్లు ఇప్పుడు టమాట పేస్ట్‌ తయారీలోకి అడుగులు వేస్తున్నాయి.

6 వేల ఎకరాలో సాగు

జిల్లాలో 6 వేల ఎకరాల్లో టమాట సాగు ఉంది. జనవరి నుంచి ప్రారంభమైన టమాట సాగు ఇప్పటి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతానికి 3 వేల ఎకరాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 5 వేల మంది రైతులు ఈ పంటపై ఆధారపడి ఉన్నారు. పలమనేరు, చౌడేపల్లి, సోమల, సదుం, శాంతిపురం, వి.కోట, గంగవరం, కుప్పం, గుడిపల్లి, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి వంటి మండలాల్లో టమాట సాగు అధికంగా ఉంది. మొదటి రకం టమాటను రైతులు కోతకు వచ్చిన స్థానికంగా ఉండే మార్కెట్‌కు తరలించి అమ్మకానికి పెడుతుంటారు.

కొనుగోలు ఇలా...

పళ్లగుజ్జు పరిశ్రమలు జిల్లాలో ప్రస్తుతం 10 ఫ్యాక్టరీలు పేస్ట్‌ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు ముఖ్యంగా రెండో రకం టమాటలను కిలోకు సుమారు రూ.4 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. పలమనేరుతో పాటు పీలేరు, కలకడ, కలికిరి, ములకల చెరువు నుంచి టమాటను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ రోజుకు 250 నుంచి 300 టన్నుల వరకు టమాటలను ప్రాసెస్‌ చేస్తున్నాయి.

గుజ్జు తయారీ లెక్కలు ఇలా....

ఫ్యాక్టరీలు కిలోకు రూ.4కు కొనుగోలు చేసిన టమాటతో తయారైన పేస్ట్‌ను సాస్‌ తయారీ కంపెనీలు కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ పేస్ట్‌ను దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. అంతేకాకుండా 18 నెలల వరకు నిల్వ ఉంచే సామర్థ్యం ఉండటం పరిశ్రమలకు అదనపు లాభంగా మారింది.

మామిడి సీజన్‌ లేనప్పుడు

సాధారణంగా మే నుంచి ఆగస్టు వరకు మామిడి గుజ్జు తయారీలో బిజీగా ఉండే ఫ్యాక్టరీలు, ఆ మధ్యలో ఖాళీగా ఉండే సమయాన్ని ఇప్పుడు టమాట పేస్ట్‌తో భర్తీ చేస్తున్నాయి. ఏప్రిల్‌ చివరి వారం నుంచి మామిడి సీజన్‌ ప్రారంభం కానుండగా, కేరళ నుంచి కాదర్‌ కాయలు, అలాగే విజయవాడ ప్రాంతం నుంచి మామిడి సరఫరా ప్రారంభమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

యంత్రాలకు పని చెబుతున్నాం...

మ్యాంగో సీజన్‌ తర్వాత ఖాళీగానే ఉంటాం. ఆ సమయంలో టమాట పేస్ట్‌ చేస్తున్నాం. జిల్లాలో 10 ఫ్యాక్టరీల వరకు టమాట పేస్ట్‌ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పేస్ట్‌ అమ్ముడుబోతున్నాయి. సాస్‌ కంపెనీలు కొనేస్తున్నాయి. మార్కెటింగ్‌లో పెద్దగా ఇబ్బంది లేదు. మామిడి సీజన్‌కు టమాటను ఆపేస్తాం.

– రఘురాం చౌదరి , పళ్ల గుజ్జు పరిశ్రమల జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు

రోజువారీగా రూ.500 టన్నులకు పైగా దిగుబడి

జిల్లాలో రోజువారీగా సుమారు 500 టన్నుల నుంచి 700 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. వీటిలో 200 టన్నుల కాయలు జిల్లా వ్యాప్తంగా అమ్మకానికి వెళుతుంటాయి. మిగిలిన టమాట మొత్తం మార్కెట్‌ల నుంచి తమిళనాడులోని చైన్నె, కోయంబత్తూరు, సేలం, విజయవాడ, కలకత్తా వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. రోజుకు సుమారు 200 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయి. మొదటి రకం టమాట ధర ప్రస్తుతం కిలో రూ.8 నుంచి రూ.12 మధ్యే ఉంది. రెండో రకం టమాటకు మాత్రం మార్కెట్‌లో కొనుగోలు చేసేవారు కరవుతున్నారు. అయితే ఈ టమాటను పలు పళ్ల గుజ్జు పరిశ్రమలు అందిపుచ్చుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement