పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాట్లు
రెండు విడతల్లో స్పాట్ ప్రక్రియ
ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఐఈవో
మూల్యాంకన షెడ్యూల్ ఇలా..
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఆదివారం నుంచి చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా మొదలవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ప్రధాన ద్వారంతో పాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేశారు. మూల్యాంకనంలో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మూల్యాంకనం చేయాలని అధికారులు సూచించారు.
20 రోజులపాటు
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి 1,67,700 పేపర్లు జిల్లాకు విచ్చేశాయి. ఆ పేపర్లను జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో పకడ్బందీ బందోబస్తు నడుమ భద్రపరిచారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 1,67,700 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,60,925 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,60,925 కోడింగ్ పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం రెండు విడతల్లో 20 రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో మూల్యాంకనం నిర్వహించనున్నారు. మొదటి విడత ఉదయం 10 నుంచి 1 గంట వరకు, 2వ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ ఒక పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది.
సిబ్బంది నియామకం
మూల్యాంకనం కోసం 480 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 60 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 160 స్క్రూటినీ నైజర్లు, 15 మంది ఏసీఈలను నియమించినట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది నియామకం పూర్తి మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినర్ల నియామక ఉత్తర్వులను బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్‌గా డీఐఈవో రఘుపతి వ్యవహరిస్తారు. జనరల్–1 గా పీసీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అబ్ధుల్ మజీద్, జనరల్–2, సీనీట్–1, సీనీట్–2గా పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు వ్యవహరిస్తారు. వీరితో పాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్లు ఎగ్జామినర్లు, స్క్రూటినీ నైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు సైతం ఆయా కళాశాలలకు చేరాయి.
నేటి నుంచి ఇంటర్
వాల్యుయేషన్ ప్రారంభం
విడత మొదలయ్యే తేదీ దిద్దనున్న సబ్జెక్ట్ వివరాలు
మొదటి మార్చి 22వ తేదీ నుంచి తెలుగు, హిందీ, హిస్టరీ, ఎకనామిక్స్, గణితం, సంస్కృతం రెండవ మార్చి 25వ తేదీ నుంచి బాటనీ, జువాలజీ, కామర్స్, ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ


