కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు కలిసి రావడంతో భక్తుల రాక మరింత పెరిగింది. ఆలయ ప్రధాన మార్గాలు, ప్రాంగణం జనంతో నిండిపోయింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ నిర్వహణతో పాటు తాగునీరు, భద్రత, పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. అదనపు సిబ్బందిని మోహరించి రద్దీని నియంత్రిస్తున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
జాబ్ క్యాలెండర్ దగా
చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ దగా అని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్‌రెడ్డి విమర్శించారు. వీటి ద్వారా 4 విడతలు, 41 నోటిఫికేషన్ల ద్వారా 10,060 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారన్నారు. గత పాలనలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా ప్రస్తుతం వాటిని ఎందుకు భర్తీ చేయలేదన్నా రు. గ్రూప్ 1, 2 పోస్టులు, ఇంజినీరింగ్ విభాగం, టీచర్ పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయన్నారు. గత పాలనలో 1.34 లక్షల ఉద్యోగాలను సచివాలయాల ద్వారా భర్తీ చేశారన్నారు.


