గుజ్జుపై బాంబు | - | Sakshi
Sakshi News home page

గుజ్జుపై బాంబు

Mar 4 2026 7:40 AM | Updated on Mar 4 2026 7:40 AM

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు తయారైంది మామిడి రైతుల పరిస్థితి. గత ఏడాది కాయలకు గిట్టుబాటు ధర లేక నష్టాలపాలైతే.. ఈ సీజన్‌ కూడా దెబ్బకొట్టేలా ఉండడంతో దిక్కుతోచని దుస్థితి దాపురించింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. గల్ఫ్‌ యుద్ధం కాస్తా గుజ్జు పరిశ్రమను అయోమయంలో పడేసింది. ఇప్పటికే లక్షల టన్నుల పల్ప్‌ నిల్వ ఉండడం ఫ్యాక్టరీల యజమానులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ తరుణంలో ఎగుమతులు నిలిచిపోవడం.. ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో తెలియకపోవడం అయోమయానికి గురిచేస్తోంది.

కాణిపాకం : జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధిని మూసివేశారు. దీంతో గల్ఫ్‌ దేశాలకు సరుకు తరలింపులు ఆగిపోయాయి. కంటైనర్‌ షిప్‌ నిర్వాహకు లు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్యాక్టరీలకు మెయిల్స్‌ పంపినట్లు తెలుస్తోంది. ఎప్పుడు రవాణా పునఃప్రారంభమవుతుందో స్పష్ట త లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. దీంతో మామిడి గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

గల్ఫ్‌ దేశాలే ఆధారం

జిల్లాలో తయారయ్యే మామిడి గుజ్జులో ఎక్కువ శాతం గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతుంది. దుబాయ్‌, సౌదీ అరేబియా, ఉమెన్‌న్‌, కతార్‌ వంటి దేశాలే ప్రధాన కొనుగోలుదారులు. ఏటా ఆగస్ట్‌ నుంచి గుజ్జు ఎగుమతులు నత్తనడకన నడిచినా... ఫిబ్రవరి నుంచి జూనన్‌ వరకు జోరందుకుంటాయి. అయితే తరచూ గల్ఫ్‌ దేశాల్లో తలెత్తే ఉద్రిక్తతలు మామిడి గుజ్జు పరిశ్రమలను కుదిపేస్తున్నాయి. ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. 2024లో ఇదే పరిస్థితి ఎదురైతే..పరిశ్రమ యజమానులు పలు బ్యాంకులకు అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కూడా యుద్ధ ప్రభావంతో ఆర్డర్లు నిలిచిపోయాయి. హార్బర్లు సక్రమంగా పనిచేస్తాయో లేదో తెలియని దుస్థితి ఏర్పడింది. గుజ్జు అధికంగా కొనుగోలు చేసే దేశాలపై బాంబుల వర్షం కురవడంతో పరిశ్రమ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. కొంత మంది ఫ్యాక్టరీ నిర్వాహకులు ముందస్తుగానే అప్రమత్తమై గుజ్జు అమ్మకాలు పూర్తి చేసుకోవడం గమనార్హం.

రూ.36 వస్తేనే గిట్టుబాటు

గత ఏడాది నవంబర్‌లో గుజ్జు కేజీ ధర రూ.30 పలికింది. ప్రస్తుతం రూ.31 వద్దే నిలిచిపోయింది. అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, కార్మిక, రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే కేజీకి కనీసం రూ.36 వస్తేనే గిట్టుబాటు అవుతుందని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. ధరలు పెరగకపోవడంతో నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

యుద్ధం నిలిస్తేనే..

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులే మామిడి గుజ్జు పరిశ్రమ భవిష్యత్‌ను నిర్ణయిస్తున్నాయి. హార్ముజ్‌ జలసంధి తిరిగి తెరుచుకుని రవాణా సాధారణ స్థితికి వస్తేనే ఎగుమతులు పునరుద్ధరించబడే అవ కాశం ఉంది. లేకపోతే ఈసారి మామిడి రంగానికి గడ్డుకాలమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ మేఘాలు తొలగకపోతే..జిల్లాలో మామిడి రైతుల నుంచి గుజ్జు ఫ్యాక్టరీల వరకు నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

గుజ్జు నిల్వలు (ఫైల్‌)

గుజ్జు ప్యాకింగ్‌ (ఫైల్‌)

జిల్లా సమాచారం

రైతుల ఆందోళన

ఈసారి మామిడి పూత విస్తారంగా రావడంతో దిగుబడి బాగుంటుందనే అంచనాలు ఉన్నాయి. చెట్టు నిండా పూతతో కళకళలాడుతున్నాయి. అయితే గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపేస్తే కాయలకు డిమాండ్‌ తగ్గిపోతుందని రైతులు భయపడుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గిపోతే ధరలు పడిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాళం వేయాల్సిందే..!

ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమల యజ మానులకు బ్యాంకు రుణాలు, వడ్డీలు, కార్మికుల జీతాలు, విద్యుత్‌ బిల్లులు భారంగా మారాయి. గుజ్జు నిల్వలు అమ్ముడుపోకపోవడంతో నగదు ప్రవాహం నిలిచిపోయింది. ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే ఫ్యాక్టరీలకు తాళం వేసే పరిస్థితి వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement