అణచివేతపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అణచివేతపై ఆగ్రహం

Mar 4 2026 7:40 AM | Updated on Mar 4 2026 7:40 AM

అంగన్‌వాడీ సంఘం నేతల ఆందోళన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై మండిపాటు గాంధీ విగ్రహం వద్ద నిరసన

‘‘ మహిళలపై దౌర్జన్యం చేస్తారా.. అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా.. పోలీసులతో దారుణంగా దాడి చేయిస్తారా.. చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమ కోసం అహర్నిశలు శ్రమించే అంగన్‌వాడీలను అణగదొక్కేందుకు యత్నిస్తారా.. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరితే నిరంకుశంగా వ్యవహరిస్తారా.. కనీసం వేతనం చెల్లించమని అడిగితే కనికరం లేకుండా ప్రవర్తిస్తారా’’ అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్‌వాడీ సంఘం నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా పోరాటం చేస్తుంటే దుర్మార్గంగా అణచివేసేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సర్కారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలపై చంద్రబాబు సర్కారు అణచివేత ధోరణి దుర్మార్గమని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోషియేషన్‌ , ఏఐటీయూసీ నేతలు మండిపడ్డారు. విజయవాడలో అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా, వారిపై పోలీసులతో దాడులకు పాల్పడడం అత్యంత దారుణమని విమర్శించారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్యకర్తలపై వేకువజామున పోలీసులు విరుచుకుపడడం హేయమని ఆవేదన వ్యక్తం చేశారు. లైట్లు ఆర్పేసి, టెంట్లు, బ్యానర్లు తొలగించి మహిళా కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

అంగన్‌వాడీ సంఘం నేతలు మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం చెల్లిస్తన్న రూ.11వేల వేతనం పెంచాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, హర్యానా తరహాలోనే మెరుగైన వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అయితే వేతనాల పెంపు గురించి అడగొద్దని మంత్రి చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాట్యుటీ అమలులోనూ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. వేసవి సెలవులు, గ్రాట్యుటీ మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే చలో సెక్రటేరియట్‌ చేపడతామని హెచ్చరించారు.

అరెస్టులు దుర్మార్గం

విజయవాడలో వేతనాల పెంపు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, జిల్లా అధ్యక్షులు కె. ప్రభావతి, ప్రధాన కార్యదర్శి కె.ప్రేమ, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజు మండిపడ్డారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీల సమస్యలు తీరుస్తామని, అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖానీ చేయడమేనని ఆరోపించారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగనవాడీ కార్యకర్తలు, నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో నేతలు మణి, రఘు, అరుణ, ఫారిదా, ఝాన్సీ, విమల, అమ్ము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement