నేడు వీరజవాన్ కార్తీక్ విగ్రహావిష్కరణ
బంగారుపాళెం: మండలంలోని ఎగువరాగిమానుపెంట గ్రామానికి చెందిన వీర జవాన్ పంగల కార్తీక్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఎడాది జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో ఎగువ రాగిమానుపెంట గ్రామానికి చెందిన సెల్వి, వరదయ్య మందడి దంపతుల కుమారుడు కార్తీక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. కార్తీక్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రం బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అమర జవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
నేటి నుంచి
ప్రజాభిప్రాయ సేకరణ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వార్షిక ఆదాయ, అవసరాల పై మంగళవారం నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. ఈ మేరకు 20న తిరుపతిలో, 22, 23 విజయవాడలో, 27 కర్నూలు విద్యుత్ కార్యాలయంలో ఏపీఈఆర్‌సీ కమిటీ సభ్యులు విచ్చేసి.. వ్యక్తిగతంగా, వీడియో కాన్ఫరెన్స్ పరంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారన్నారు.ముందుస్తుగా ఏపీఈఆర్సీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నవారు అర్హులన్నారు. దరఖాస్తు చేసుక్నునవారికి స్లాట్ ఇస్తారని, ఆ సమయంలో సూచించిన ప్రదేశానికి వెళ్లి అభిప్రాయాలు తెలపవచ్చన్నారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను పరిష్కారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. సోమవారం నిర్వహించిన డయల్‌యువర్ ఎస్‌ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. ఈ మేరకు వెదురుకుప్పంలో అదనపు సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయా లని వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. అదే విధంగా జీడీనెల్లూరులో లూజ్‌లైన్ ఉందని, వాటిని సరిచేయాలని మరో వినియోగదారు డు కోరారు. వాటిని పరిష్కారించాలని ఈఈని ఆదేశించారు.
నాణ్యమైన సేవలందించాలి
చిత్తూరు కలెక్టరేట్ : పశువైద్యాధికారులు పాడిరైతులకు నాణ్యమైన సేవలందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ఉచిత పశుఆరోగ్య శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాడి రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని 697 గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శిబిరాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్‌వో మోహన్‌కుమార్, పశుసంవర్థక శాఖ జేడీ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
నేడు వీరజవాన్ కార్తీక్ విగ్రహావిష్కరణ


