ఇళ్ల వద్ద కోళ్ల షెడ్డు నిర్మించొద్దు
నివాసం ఉండే ఇళ్ల వద్ద కోళ్ల షెడ్డు నిర్మిస్తున్నారయ్యా.. అంటూ యాదమరి మండలం, కుక్కలపల్లి గ్రామవాసులు వాపోయారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌లో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ కుక్కలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న కన్నయ్యనాయుడు భార్య చంద్రకళ సర్వే నం. 125/2ఏలో కోళ్ల షెడ్డు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నివాసం ఉంటున్న ప్రాంతంలో కోళ్ల షెడ్డు నిర్మిస్తే ఇబ్బందులు వస్తాయని, ఈ మేరకు 2020లో అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు షెడ్డు నిర్మించకుండా పనులు ఆపేశారని, ప్రస్తుతం తిరిగి పనులు మొదలు పెట్టారన్నారు. పనులు ఆపివేయాలని తాము విన్నవించుకుంటున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తమపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు.


