మొరవెత్తిన దేవర!
పుట్టింటి నుంచి దేవర్లు, పొట్టేళ్లు సమర్పించాలి చారాలలో పూర్వీకుల నుంచి కొనసాగుతున్న ఆచారం ఘనంగా చారాల ఆడబిడ్డ చౌడేశ్వరీదేవికి దేవర్లు
చౌడేపల్లె: పూర్వీకుల నుంచి పాటిస్తున్న ఆచారం, సంప్రదాయాలను నేటికీ చౌడేపల్లె మండలం, చారాల గ్రామంలో ఆచరిస్తున్నారు. చరిత్రలో ఎక్క డా లేని విధంగా ఆ గ్రామానికి సమీపంలో గల చారాల చెరువు మొరవ పోతే ఆ గ్రామ ఆడబిడ్డగా పేరుగాంచిన చౌడేశ్వరీదేవికి పైళ్లెన కొత్త దంపతులు తొలి సారిగా జన్మించిన బిడ్డతో కలిసి దేవర్లు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఓ పండుగలా జరుపుకోవడం విశేషం. దేవర చేయడానికి దేవర సామగ్రి, పొటేళ్లను చారాల గ్రామానికి వచ్చిన కోడలు ఆమె పుట్టినింటి నుంచి తీసుకురావడం విశేషం.
ఎలా చేశారంటే
ఆదివారం చారాల గ్రామ సమీపంలోని ఓదులపేట వద్ద గల చౌడేశ్వరీదేవి కుంట కట్ట కింద వెలసిన ఆలయం వద్ద మేళ తాళాల నడుమ గ్రామం నుంచి దేవర బుట్లతో కొత్త దంపతులు చేరుకున్నారు. ఈ చెరువు నిండి మూడేళ్లు కావడంతో ఆ గ్రామంలో మూడేళ్లలోపు పెళ్లి చేసుకున్న వారు చౌడేశ్వరీదేవికి సారెతోపాటు గంప ద్వారా దేవర చేశారు. మొక్కుబడిగా పొట్టేళ్లు సమర్పించారు. దంపతులచేత అమ్మవారికి పూజలు చేసి వారికి పుట్టిన బిడ్డలకు చెవి, ముక్కు పుడకలు కుట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడ పండుగ వాతావారణం నెలకొంది. బంధుమిత్రుల సందడి కనిపించింది.
చారాల చెరువు మొరవ పోతే ..దేవర్లు చేయాల్సిందే!
చెరువు నిండితేనే దేవర్లు?
నా వయస్సు 85 ఏళ్లు. నాకు తెలిసినప్పటి నుంచి చెరువు నిండి మొరవ వెళ్లితేనే చౌడేశ్వరీదేవి ఆలయం వద్ద దేవర్లు చేస్తారు. ఒకసారి 11 ఏళ్లు తరువాత దేవర్లు చేశాం. ఆ సమయంలో సుమారు 52 పొటేళ్లతో ఆడ బిడ్డ చౌడేశ్వరీదేవికి మొక్కులు చెల్లించారు. ఎప్పుడు చెరువు నిండి మొరవ పోతే కొత్తగా పెళ్లయిన దంపతులు పూజలు చేయడం ఆనవాయితీ. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.
– జగడం పాపిరెడ్డి, ఎరికలపల్లె, చారాల పంచాయతీ
మొరవెత్తిన దేవర!
మొరవెత్తిన దేవర!


