అమ్మ ఆఖరి చూపు కోసం!
కన్నీరు తెప్పించిన దంపతుల మరణం
ఇరువురికి ఒకేచోట అంత్యక్రియలు
తనకు దిక్కెవరంటూ రోదించిన కుమారుడు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తల్లి ఇక లేరనే మాట విని ఆ కన్న కొడుకు గుండె బరువెక్కింది. కన్నీళ్లతో అమ్మను స్మరిస్తూ.. అమ్మ ఆఖరి చూపు కోసం కష్టాలు అన్నీఇన్ని కావు. విదేశం నుంచి స్వదేశం చేరుకోవడానికి యూఎస్‌లో ఫ్‌లైట్ టిక్కెట్ దొరకని పరిస్థితి. ఆదివారం అమ్మ కరుణతో..అధిక రేటుకు టిక్కెట్ చిక్కింది. హుటాహుటిన బయలు దేరిన ఆ కొడుకు భసవంత్‌రెడ్డి సొంతూరుకు చేరుకొని తల్లి శ్రీకళాదేవి మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
అంత్యక్రియలు సమాప్తం..
తీర్థయాత్రలకు వెళ్లిన చిత్తూరు వాసులు పలు వురు శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈక్రమంలో గిరింపేట మరాఠివీధికి చెందిన శ్రీకళాదేవి (64) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టు మార్టు గదిలో ఉంచారు. యూఎస్ నుంచి కు మారుడు భసవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం చిత్తూరుకు చేరుకోగానే ఇంటి కి వద్దకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆపై స్వగ్రామమై న శేషాచలపురం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా మృతురాలి ఇంటి విషాదఛాయలు అలుముకున్నాయి.
కుమారుడికి ఓదార్పు
స్వగ్రామానికి చేరుకున్న శ్రీకళాదేవి మృతదేహానికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి నివాళులర్పించి బాధితరాలు కుమారుడిని ఓదార్చారు. విదేశాల నుంచి స్వదేశం చేరుకోవడానికి పడ్డ కష్టాలను చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు విజయ్‌రెడ్డి తదితరులున్నారు.
పలమనేరు : దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ ఉన్నత చదువుల్లో ఉండడంతో తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అవే వారి చివరి యాత్ర గా మారుతాయని అనుకోలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన సునంద, శివశంకర్ రెడ్డి దంపతులు ఇద్దరూ అసువులు బాశారు. వీరి మృతదేహాలు శనివారం పలమనేరుకు చేరుకున్నాయి. వీరి అంత్యక్రియలు పెద్దపంజాణి మండలం లింగాపురంలో ఆదివారం నిర్వహించారు.
అశ్రునయనాల మధ్య ఇద్దరినీ ఒకేచోట
ఆ భార్యాభర్తలను పలమనేరు పట్టణం మీదుగా తీసుకెళ్లి పెద్దపంజాణి మండలంలోని లింగాపురంలో వారి సొంత భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ హృదయ విచారకర సంఘటన అక్కడున్న వారిని కలచివేసింది. ఇలా ఉండగా బీడీఎస్ చేస్తున్న వీరి కుమారుడు వేంకటసాయి దిక్కులేనివాడిగా మారాడు.
కలిసి బతికారు..
కలిసే కన్నుమూశారు..
అమ్మ ఆఖరి చూపు కోసం!


