
దయ చూపండయ్యా!
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వినతులు ఇస్తూనే ఉన్నాం.. దయ చేసి న్యాయం చేయండి’ అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపాడేల్ ఎదుట తమ సమస్యల గోడును విన్నవించుకున్నారు. ఇదిలావుండగా పలు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ధర్నాలతో కలెక్టరేట్ దద్ధరిల్లింది. వివిధ సమస్యలపై 292 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు.
కార్పొరేట్ సెలూన్ షాపులను అరికట్టాలి
చిత్తూరులో కార్పొరేట్ సెలూన్ షాపులను అరికట్టాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో నాయీ బ్రాహ్మణులు కలెక్టరేట్‌కు విచ్చేసి ధర్నా నిర్వహించారు. చిత్తూరులో అధిక సంఖ్యలో విచ్చల విడిగా కార్పొరేట్ సెలూన్ షాపులు పుట్టుకొస్తున్నాయన్నారు. వీటి వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు.
ఆత్మహత్యే శరణ్యం
పెనుమూరు తహసీల్దార్ వద్దకు ఎన్ని సార్లు తిరిగినా న్యాయం జరడం లేదని, తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని పెనుమూరు మండలం, శాతంబాకం గ్రామానికి చెందిన సురేష్, నదియా దంపతులు వాపోయారు. తమకున్న కొంత సాగుభూమికి వెళ్లే దారిని మూసి వేసి అగ్రకులస్తులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి దళితులమైన తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
వారిపై చర్యలు తీసుకోవాలి
యాదమరి మండలంలోని బుడితిరెడ్డిపల్లి ముస్లింవాడలో ఉండే మూడు ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. బుడితిరెడ్డిపల్లి ముస్లింవాడలో ఓ కుటుంబానికి చెందిన ఒక మహిళను పెళ్లి చేస్తుకున్నారనే నెపంతో గ్రామ బహిష్కరణ చేశారన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మునెమ్మకు న్యాయం చేయాలి
గంగవరం మండలం, బూడిదిపల్లికి చెందిన దళిత మహిళ మునెమ్మకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా మునెమ్మ అనుభవంలో ఉన్న రేకుల షెడ్‌ను ప్రైవేట్ వాహనంతో తొలగించడం దారుణమన్నారు. ఈ సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ వారంలోపు సమస్య పరిష్కరించాలని పలమనేరు ఆర్‌డీవోను ఆదేశించారు. లేని పక్షంలో తానే స్వయంగా వచ్చి బాధితులకు న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
జీతాలు పెంచాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులకు జీతాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెస్ బిల్లులను పెంచాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్నభోజన కార్మికుల జీతాల బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. తమిళనాడు, కర్ణాటకలో జీతాలు పెంచారని, ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు.
కలెక్టర్‌కు దండం పెట్టి వేడుకుంటున్న అర్జీదారులు
గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న సీపీఐ నాయకులు

దయ చూపండయ్యా!