
ఇంత చిన్న చూపా?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులంటే ఎందుకంత చిన్న చూపని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రశ్నించింది. వలంటీర్లు చేయాల్సిన పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడం ఏ మాత్రం భావ్యం కాదని మండిపడింది. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించింది. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది.
వలంటీర్ విధులు మాకొద్దు
వలంటీర్‌ల విధులు తమకొద్దని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు వినోద్ తేల్చిచెప్పారు. ఆయన మాట్లాడు తూ తమ న్యాయమైన సమస్యలను కూటమి ప్రభు త్వం పరిష్కరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగులకు ప్రభుత్వం వలంటీర్ పనులు అప్పగించి ఒత్తిడి చేయడం దారుణమన్నారు. సచివాలయ ఉద్యోగులకు కచ్చితమైన జాబ్‌చార్ట్ విడుదల చేయాలన్నారు. ప్రొబేషన్ 9 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. డోర్ టు డోర్ సర్వేల నుంచి తమకు విముక్తి కల్పించాలన్నారు. ఇంటింటి సర్వేలకు వెళ్తుంటే ప్రజలు ఓటీపీ చెప్పడానికి ఇష్టపడడం లేదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ సంఘ సభ్యులు త్యాగరాజు, జానకీరామ్, బాలాజీ, అరుణకుమారి, జయశ్రీ, హరికృష్ణ పాల్గొన్నారు.