
పోలీసు గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 41 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్‌బాషా ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, వన్‌టౌన్ సీఐ మహేశ్వర సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను అందుకున్నారు.
ఆధిపత్య రగడ
చౌడేపల్లె: ఆలయ ఆవిర్భావ వంశస్తులకు, దాత మధ్య మండలంలోని గాండ్లపల్లె అభయాంజనేయస్వామి దేవస్థానం నిర్వాహక ఆధిపత్య రగడ సాగుతోంది. ఈ వివాదం సోమవారం సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండకు చేరింది. పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకొని నిర్వహణ అర్హతపై చర్చించారు. ఇందులో వెలుగుచూపిన అంశాలు మూడు తరాల క్రితం దుర్గసముద్రం పంచాయతీ పరిధిలోని గాండ్లపల్లెకు చెందిన జమ్మలమడుగు పెద్ద రామాంజులమ్మ, వెంకటస్వామి దంపతులకు ఏళ్ల తరబడి సంతానంలేదు. స్వామీజీ వద్దకు శాస్త్రానికి వెళ్లగా ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని సెలవించారు. స్వామీజీ సూచనల మేరకు గ్రామపంచాయతీలోని చెన్నకేశ్వరస్వామి మాన్యం భూమిలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వారి వంశస్తులే ధూపధీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణకర్త మనవడు జమ్మల మడుగు హరినాథ్ బాధ్యతలు చూస్తున్నారు. ఇలా ఉండగా 2007లో అదే పంచాయతీకి చెందిన దాత గిరినాథప్రకాష్ గ్రామ పెద్దల వద్ద అనుమతి తీసుకొని ఆలయానికి ప్రాకారం నిర్మించారు. కొంత కాలంగా ఆలయంపై దాత ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ కొంతమంది ద్వారా వివాదాలు సృష్టిస్తున్నారు. నిర్వాహకులు, దాత మధ్య వివాదం పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాకారం నిర్మాణం చేపట్టిన సమయంలోనే పెద్దల సమక్షంలో కలిసి నిజానిజాలను అందరి అభిప్రాయాలను రికార్డు చేశారు. అనాధిగా ఆలయ నిర్మాణానికి కారణమైన వారి వంశుస్తులకే నిర్వహణ భాధ్యత ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. గాండ్లపల్లెకు చెంది పుంగనూరులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బగ్గిడిగోపాల్, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ సరస్వతమ్మ పాల్గొన్నారు.
సెలవులో డీఆర్వో
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్‌కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టారు. అక్టోబర్ 2 వరకు ఆయన సెలవు పెట్టడంతో ఇన్‌చార్జి బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారికి అప్పగించారు. కలెక్టరేట్‌లో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారికి ఇన్‌చార్జ్ డీఆర్‌వోగా బాధ్యతలప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు