
కోర్టులో ఉన్న భూమిపై కూటమి నేత పెత్తనం
పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ సీపీ సానుభూమి పరులపై అధికార పక్షానికి చెందిన నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారని సాతంబాకం రెవెన్యూ లెక్క దాఖలాలోని కొందరు రైతులు సోమవారం పెట్రోల్ క్యాన్‌తో నిరసన వ్యక్తం చేశారు. మహిళా రైతులు మాట్లాడుతూ పెనుమూరు మండలం, సాతంబాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.39/1లో 1.79 సెంట్లు నాగేశ్వరరావు, భారతి పేరుతో ఉందన్నారు. అలాగే సర్వే నం.40లో 79 సెంట్లు జీఎస్.సుబ్రమణ్యంరెడ్డి పెరుతో ఉందన్నారు. తమ భూములకు ఆనుకుని అదే గ్రామానికి చెందిన కూటమి నేత సురేష్‌కు కొంత భూమి ఉండడంతో ఆ భూమికి దారి కల్పించాలని అధికారులపై దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ భూతగాదా ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. అయినప్పటికీ కూటమి నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో తాము లేని సమయంలో జేసీబీ యంత్రాలతో చదును చేస్తూ అక్రమంగా దారి ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అడితే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమంటూ పెట్రోల్ క్యాన్‌తో నిరసన తెలిపారు.