
వైద్య విద్య..అందని ద్రాక్ష
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో వైద్య విద్య పేదలకు అందని ద్రాక్షలా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడం రివాజుగా మారుతోందన్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తన లబ్ధి కోసం పెత్తందారుల చేతిలో పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక్క మెడికల్ కళాశాలను తీసుకు రాలేక పోయాడని ఎద్దేవాచేశారు. అధికారం చేపట్టిన 15 నెలలకే అన్ని రంగాల అధికారులు, విద్యార్థులు నిరసన సెగలు తెలుపుతున్నా బాధ్యతగల పదవిలో ఉంటున్న చంద్రబాబు పట్టించుకోకపోవడ దారుణమన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,496 మంది స్వామివారిని దర్శించుకున్నారు 29,591 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో తిరుమలేశుని దర్శించుకోగలగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
సెలవు దినం అయినా..
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల సౌకర్యార్థం ఈనెల 30న ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు వసూలు కేంద్రాలు పనిచేస్తాయని విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు డివిజన్ పరిధిలోని అన్ని వసూలు కేంద్రాలు మంగళవారం యథావిధిగా పనిచేస్తాయన్నారు.