
చెరువు చెప్పదు.. ఆక్రమణ ఆగదు
కూటమి నేతలకు కల్పతరువుగా చెరువులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా నోరు మెదపని అధికార యంత్రాంగం చిత్తూరు కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే చెరువులో ఆక్రమణలు మట్టి, గ్రానైట్ రాళ్లతో చెరువును పూడ్చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువు
చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. అధికారులు చెరువుల చుట్టూ శాశ్వత హద్దులు ఏర్పాటు చేయకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. చెరువు భూముల్లో మట్టిని, గ్రానైట్ వ్యర్థాలను పోస్తూ టీడీపీ నేతలు అధికార దర్పంతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న గంగాసాగరం చెరువును ఆక్రమించేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ టీడీపీ కబ్జాదారులకు సహకరిస్తుండడంతో సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని గంగాసాగరం చెరువు ఆక్రమణపై సాక్షి కథనం..
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రంలో ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నేతలు ప్రకృతి వనరులపైనే పడతారు. వాటిని ఆక్రమించడం.. ప్లాట్లు వేసి అమ్ముకోవడం పరిపాటిగా మార్చుకున్నారు. గత ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో తమ పంథా మొదలుపెట్టారు. చెరువు ఏదైనా తమదే ఆక్రమణ అనేలా తెగబడుతున్నారు. వీరి ఆక్రమణలకు అంతులేకుండా పోవడంతో భవిష్యత్ రోజుల్లో మనం పుస్తకాల్లో మాత్రమే చెరువుల గురించి చదువుకునే స్థితికి చేరుకునేలా కబ్జాలకు గురవుతున్నాయి. కూటమి సర్కారు పాలనలో చెరువులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. దీంతో చెరువులు పూర్వపు రూపురేఖలు కోల్పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ నేతలు అధికారదర్పంతో చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నారు. చెరువులు ఆక్రమణలతో ఆయకట్టుదారులకు సమీప గ్రామాల ప్రజలకు నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ కబ్జాదారుల ఆక్రమణలపై పలుమార్లు పీజీఆర్‌ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందన లేదు. అధికారుల ఉదాశీనతతో చెరువులు రూపురేఖలు కోల్పోతుండగా తూములు పూడిపోతున్నాయి.
కలెక్టరేట్‌కు కూతవేటులో ఆక్రమణ
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు కూతవేటులో ఉన్న గంగాసాగరం చెరువు ఎంతో పురాతనమైనది. ఇది జిల్లాలోని ప్రధాన నీటి వనరులలో ఒకటిగా గుర్తింపు పొందింది. గంగాసాగరం చెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే 15 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. చెరువు సమీపంలో 125–1 సర్వే నంబర్‌లో 1975లో డీకేటీ పట్టా ఇచ్చారు. దాన్ని మళ్లీ అధికారులే 1978లో రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంగాసాగరం చెరువుపై టీడీపీ నేత కన్ను పడడంతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ చెరువులో మట్టి, గ్రానైట్ వ్యర్థాలను తీసుకొచ్చి పూడ్చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చెరువు ఆక్రమణపై పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి అక్కడి స్థానికులు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోని దుస్థితి. కలెక్టర్ ప్రత్యేక దృష్టి వహించి గంగాసాగరం చెరువు ఆక్రమణకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
కొన్ని ఆక్రమణలు ఇలా..
ఏ చెరువులోనూ సెంటు భూమిని కూడా ముట్టుకునే అధికారం జిల్లా సర్వోన్నత అధికారాలు ఉన్న కలెక్టర్‌కు కూడా లేవు. ప్రజాప్రతినిధులకు సైతం వాటిని ప్రోత్సహించే హక్కు లేదు. ప్రజా ప్రయోజనాల అవసరం కోసం చెరువును ముట్టుకున్నా, దానికి చట్టపరమైన విధి విధానాలకు లోబడే జరగాలి.
– చెరువుల పరిరక్షణపై
సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి
చెరువుల వివరాలు..
జిల్లాలోని చెరువులు 4303
ఆయకట్టు 46,903 ఎకరాలు
నీరందుతున్న ఆయకట్టు 20 వేల ఎకరాలు
ఆక్రమణకు గురైన చెరువులు 1800
కబ్జాబారిన పడిన విస్తీర్ణం 1147 ఎకరాలు
చిత్తూరు నగర పరిధిలో చెరువుల విస్తీర్ణం 630 ఎకరాలు
నగర పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు 75 ఎకరాలు

చెరువు చెప్పదు.. ఆక్రమణ ఆగదు