
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
తమిళనాడులో జరిగిన లారీ ప్రమాదంలో బాలుడు దుర్మరణం
లారీని వెనుక వైపు ఢీకొనడంతో ఘటన
వెండుగంపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృత్యువాత
కుప్పంరూరల్: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన కుప్పంలో వెలుగు చూసింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలవగా, కుప్పం మండలం వెండుగంపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా..
తమిళనాడు
ప్రమాదంలో ..
కుప్పం పట్టణానికి చెందిన రవికుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సొంత పనులపై భార్య, కుమారుడు సాత్విక్ (17)తో కలిసి చైన్నెకి వెళ్లాడు. పనులు ముగించుకుని శనివారం రాత్రి కుప్పానికి తిరుగుప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో నాట్రంపల్లి వద్ద లారీని వెనుక వైపు నుంచి ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ ఘటనలో సాత్విక్ (17) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. రవికుమార్, అతని భార్య గాయాలతో బయటపడ్డారు.
వెండుగంపల్లి వద్ద ఘటనలో..
కుప్పం మండలం వెండుగంపల్లి వద్ద ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కుప్పం మండలం గట్టప్పనాయునిపల్లికి చెందిన మునెప్ప (50) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనులపై బైక్‌లో వెండుగంపల్లి వైపునకు వెళ్లాడు. పైనాసికి క్రాస్ వద్ద మునెప్ప ప్రయాణిస్తున్న బైక్‌ను టాటాఏస్ వేగంగా వచ్చి ఢీకొంది.
ప్రమాదంలో మునెప్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.