
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి
చౌడేపల్లె: రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆనందంగా జీవనం గడపాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతీమణి స్వర్ణమ్మ దంపతులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజుతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ ఈఓ ఏకాంబరం ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మహాచండీ దేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారికి పెద్దిరెడ్డి దంపతులు ప్రత్యేక అభిషేక పూజలు, అర్చనలు, చేశారు. అనంతరం హోమ పూజల్లో పాల్గొని, ప్రధాన గర్భాలయం కింద ఉన్న మూలస్థానం, రణభేరి గంగమ్మ అమ్మవార్లకు పూజలు చేశారు. వేదపండితులు పెద్దిరెడ్డి దంపతులకు ఆశీర్వాదం అందించారు. అనంతరం ఈఓ పవిత్ర తీర్థప్రసాదాలతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల సంఘ అధ్యక్షుడు బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, పుంగనూరు ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి కొత్తపల్లి చెంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.