
మీకు అండగా ఉండేందుకే డిజిటల్ బుక్
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని, అందుకే అన్యాయానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్ ఆవిష్కరించారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఆయన పుత్తూరులోని తన నివాసంలో నాయకులతో కలిసి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి రికార్డులతో చేరవేయడానికి జననేత జగనన్న ఎంచుకున్న బాణం డిజిటల్ బుక్ అని అన్నారు. డిజిటల్ బుక్‌లో నమోదు చేసే ప్రతి సమస్యను అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని జగనన్న కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఇబ్బందులు పెడితే 040–49171718 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కలసికట్టుగా పని చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. డిజిటల్ బుక్‌పై గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఆగడాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.