
వైఎస్సార్‌సీపీ శ్రేణుల రక్షణకు డిజిటల్ బుక్
నగరి : కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేశారని మాజీ మంత్రి ఆర్కేరోజా స్పష్టం చేశారు. ఆదివారం ఆమె తన నివాస కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతోందని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు కోర్టులు అక్షింతలు వేస్తున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్ బుక్’లో నమోదు చేయవచ్చన్నారు. ‘‘డీబీ.డబ్ల్యూఈవైఎస్‌ఆర్‌సీపీ.కామ్’’ అనే వెబ్‌సైట్‌లో గానీ, 040–49171718 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. పార్టీ లీగల్ సెల్ ప్రధానకార్యదర్శి రవీంద్ర, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, బాలన్, జెడ్పీటీసీ పరంధామన్, నిండ్ర, విజయపురం ఎంపీపీలు లత, మంజుబాలాజి, భార్గవి, నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మున్సిపల్, మండల అధ్యక్షులు, మండల పార్టీ కమిటీ, అనుబంధ కమిటీ నేతలు పాల్గొన్నారు.