
రేబిస్‌తో బీకేర్‌ఫుల్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రేబిస్‌తో బీకేర్‌ఫుల్ అని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి సూచించారు. చిత్తూరు నగరంలోని జిల్లా పశు వైద్యశాలలో ఆదివారం ప్రపంచ రేబిస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అనంతరం యజమానులకు పెంపుడు కుక్కల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రతి యజమాని తమ పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలన్నారు. కుక్కలను బయటికి తీసుకెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెంపుడు కుక్కల వల్ల ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. కుక్క కరిస్తే ప్రజలు వెంటనే టీకాలు వేయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎపిడిమాలజిస్ట్ శ్రీవాణి, పశుసంవర్థకశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
1,276 కుక్కలకు టీకాలు
ప్రపంచ రేబిస్ డేలో భాగంగా జిల్లావ్యాప్తంగా 1,276 పెంపుడు కుక్కలకు టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. 33 మండలాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సాయంత్రానికి 1276 కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలు వేశామన్నారు.