
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అప్పగించడం సబబు కాదని విమర్శించారు. 2019–2024 సంవత్సరాల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. వాటిలో 5 కళాశాలలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం అయినట్లు తెలిపారు. ఆ కళాశాలల్లో 750 సీట్లతో మెడికల్ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారన్నారు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో గత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను స్థాపించారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు నిధుల కొరత అనే కుంటి సాకుతో ప్రారంభించకుండా ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మెడికల్ కళాశాలలకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుంటి సాకులతో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో రెండు లక్షల కోట్లను అప్పుచేసి అమరావతి రాజధాని నిర్మాణానికి 70 వేల కోట్ల టెండర్లను పిలిచిందని విమర్శించారు. ప్రజలకు మేలు కలిగే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడం విఫలమైందని ఆరోపించారు.
కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పేందుకే..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఎలాగైనా కార్పొరెట్ వ్యక్తులకు అప్పజెప్పాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర లీగల్ సెల్ మెంబర్లు సుగుణశేఖర్‌రెడ్డి, గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వారు మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత స్వాలాభం కోసం కుట్రలు చేసి ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు. నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను పూర్తి చేసేందుకు రూ.5 వేల కోట్లు పెడితే సరిపోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారని విమర్శించారు. రూ.8 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం దోచుకునేందుకేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేసి ప్రైవేటీకరణ సమస్యలను విన్నవించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా జాయింట్ సెక్రటరీలు దివాకర్‌రెడ్డి, గౌమతి, ఉదయ్‌భాను, చిత్తూరు నియోజకవర్గం అధ్యక్షులు చక్రవర్తిరెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గం జాయింట్ సెక్రటరీ హరిబాబు, పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు సోమశేఖర్‌రెడ్డి, సెక్రెటరీలు కృష్ణమూర్తి, ఇషాద్, నగరి నియోజకవర్గం అధ్యక్షులు బాబు, సెక్రెటరీ నాగరాజు, మెంబర్ తిరుమలయ్య, పలమనేరు కార్పొరేషన్ లీగల్ సెల్ మెంబర్ హరికృష్ణారెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.