మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు | - | Sakshi
Sakshi News home page

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు

Sep 27 2025 5:15 AM | Updated on Sep 27 2025 5:15 AM

మట్టి

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు

కట్టమంచి చెరువులో మట్టి తవ్వి అమ్ముకున్న టీడీపీ నేతలు ఆధారాలతో సహా గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు కేసు నమోదు కావడంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు ఏపీ చీఫ్‌ సెక్రటరీ, కలెక్టర్‌తో సహా ప్రతివాదులుగా మరో నలుగురు అధికారులు

అధికార బలంతో కూటమి నేతలు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువుపై కన్నేశారు. పూడికత తీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు ఒడిగట్టారు. పొద్దున్నుంచి చీకటి పడేవరకు యంత్రాల సహాయంతో తవ్వేయడం.. ఆపై ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా ఈ తంతు సాగుతున్నా ఏ ఒక్క అధికారీ వారికి అడ్డుచెప్పలేకపోయారు. ఎట్టకేలకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు కావడంతో తోకముడిచారు. శుక్రవారం మట్టితవ్వకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

కన్నుమన్ను కానకుండా..!

ఆగిన పనులు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువును కూటమి నేతలు చెరబట్టారు. అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు పూనుకున్నారు. గత ఎనిమిది నెలలుగా ఉదయం నుంచి రాత్రి వరకు యంత్రాలు పెట్టి అందినకాడికి అడ్డంగా తవ్వేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోతు లోడేశారు. ఈ అక్రమ తవ్వకాల్లో స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధి పాత్ర కీలకంగా ఉందనే ఆరోపణలు మిన్నంటాయి. ఎనిమిది నెలల క్రితం నుంచి తవ్వుతున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడ లేదు. ప్రొక్‌లైనర్లతో మట్టి తవ్వి వందల ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నా అడ్డుచెప్పలేదు. దీనిపై ఇదివరకే సాక్షి దినపత్రికలో ఈ ఏడాది మే 03, మే 12, జూలై 19 తేదీలలో పతాక స్థాయిలో వార్తలు వెలువడ్డాయి. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు.

గతంలో సాక్షిలో ప్రచురితమైన ప్రత్యేక కథనం

గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు కావడంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాలపై అనేక ఆరోపణలు నమోదైనప్పటికీ అధికారిక యంత్రాంగం పట్టించుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో చరిత్ర కలిగిన కట్టమంచి చెరువు రూపురేఖలు మారిపోయినా కన్నెత్తి చూడలేదు. ఇష్టానుసారంగా మట్టి తవ్వితే కట్టమంచి చెరువుకు ప్రమాదం అని తెలిసినప్పటికీ అడ్డుకోలేదు. ప్రస్తుతం గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు కావడంతో కట్టమంచి చెరువులో శుక్రవారం నుంచి మట్టితవ్వకాలు నిలిపివేశారు.

పక్కా ఆధారాలతో గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు

జిల్లా కేంద్రంలోని గాండ్లపల్లి రెవెన్యూ పరిధి సర్వే నం.1లోని కట్టమంచి చెరువులో టీడీపీ నేతలు పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు పూనుకున్నారు. ఈ విషయం పై తిరుపతి జిల్లా, కేవీబీపురం మండలం, కళత్తూరు గ్రామానికి చెందిన కోలా విజయ్‌కిరణ్‌ అనే న్యాయవాది గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చైన్నె బెంచ్‌లో పిటీషన్‌ వేశారు. కట్టమంచి చెరువులో మట్టిని తొలగించడం పర్యావరణ రక్షణ చట్టం 1986 సెక్షన్‌ 5ను ఉల్లంఘించడమేనని ఉద్ఘాటించారు. కట్టమంచి చెరువులో 2 కి.మీ చుట్టు కొలతతో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమ రవాణాపై పీజీఆర్‌ఎస్‌ (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌)లో పిటీషన్‌ వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కట్టమంచి చెరువును కాపాడేందుకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు నమోదయ్యింది. ఏపీ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, ఎన్విరాన్‌మెంట్‌ ఫారెస్ట్‌, సైన్స్‌, టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, చిత్తూరు కలెక్టర్‌, చిత్తూరు నగరపాలక కమిషనర్‌, చిత్తూరు తహసీల్దార్‌, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కార్యదర్శిని ప్రతివాదులుగా నమోదు చేశారు.

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు 1
1/3

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు 2
2/3

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు 3
3/3

మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement