
రేణిగుంట: ఎమ్మెల్యే బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాడా..? అనే అనుమానం వస్తోందని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. విజయవాడ నుంచి శుక్రవారం రాత్రి రేణిగుంటకు చేరుకున్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ప్రతి ఒక్కరికీ దేవాలయం లాంటిదని, అలాంటి ప్రదేశంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. మానవత్వం, కృతజ్ఞత అనేది బాలకృష్ణకు ఉంటే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై అలాంటి మాటలు మాట్లాడరన్నారు.
కౌరవుల సభలో ద్రౌపదిని అవమానించి ఆనందించినట్లు అసెంబ్లీలో అభివృద్ధిని పక్కనపెట్టి జగన్ జపం చేస్తున్నారని అన్నారు. బాలకృష్ణ చేసిన పనికి రాజశేఖరరెడ్డి తలుచుకుని ఉంటే జీవితాంతం జైల్లో ఉండేవారన్నారు. మానవత్వం చూపిన కుటుంబంపై ఈ విధంగా మాట్లాడడం తగదన్నా రు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా బాలకృష్ణ అభిమానే అని.. అలాంటి వ్యక్తిపై వ్యక్తిత్వం చంపుకొని మాట్లాడడం బాధాకరమన్నారు. అయితే సినీ నటుడు చిరంజీవి హుందాతనంతో వెంటనే స్పందించారని అన్నారు. చిరంజీవి స్పందించకుండా ఉంటే ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లి ఉండేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి లాగానే పవన్ కళ్యాణ్ కూడా నడుచుకుంటే బాగుంటుందని హితవు పలికారు.