
ఆ గౌరవం కూడా పోయింది
పలమనేరు: అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహారశైలి, మాట్లాడిన తీరును చూసి వారి తండ్రి ఎన్టీరామారావుపై ప్రజల్లో ఉన్న గౌరవం కూడా పోయిందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. బాలకృష్ణ సినిమాల కోసం గత ప్రభుత్వంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నుంచి లబ్ధిపొందినప్పుడు ఆయన మంచివారు.. ఇప్పుడు చెడ్డవారా..? అని ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సభలో సంబంధంలేని చిరంజీవిపై తూలనాడడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇంత జరిగినా జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు మాట్లాడకపోవడం మరీ ఘోరమన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎన్నటికీ టీడీపీకి జనసేన కట్టుబానిసగా ఉండాల్సిందేనని తెలుస్తోందన్నారు. బాలకృష్ణ అదే అసెంబ్లీలో జగనన్నకు సారీ చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.