
నేడు ఐఐటీ ఫేజ్–బీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఏర్పేడు : తిరుపతి ఐఐటీ శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఫేజ్–బీ పనులకు శనివారం భారత ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేయనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐఐటీ అభివృద్ధికి ఫేజ్–బీ కింద రూ.2,313 కోట్లు నిధులు కేటాయించింది. ఫేజ్–ఏలో ఇప్పటికే రూ.1,444 కోట్లు ఖర్చు చేయగా, ఫేజ్–బీ నిధులతో మరింతగా ఐఐటీ శాశ్వత ప్రాంగణం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరు కానున్నారు.